సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు

  • 8 కోట్ల ఏళ్ల కిందట జీవించిన సముద్రపు జీవికి గుర్తింపు
  • దీనికి టైలోసారస్ రెక్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
  • సముద్రపు 'టి-రెక్స్'గా దీనికి పేరు వచ్చింది
  • పొడవులో భూమిపైని టి-రెక్స్‌ను మించిపోయింది
  • పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చివేసేదని వెల్లడి
సుమారు 8 కోట్ల ఏళ్ల కిందట సముద్రాలను ఏలిన ఓ భయంకరమైన జీవిని శాస్త్రవేత్తలు తాజాగా అధికారికంగా గుర్తించారు. దీనికి 'టైలోసారస్ రెక్స్' అని పేరు పెట్టారు. సముద్రంలో దీని ఆధిపత్యం కారణంగా దీన్ని "సముద్రపు టి-రెక్స్"గా అభివర్ణిస్తున్నారు. చివరి క్రెటేషియస్ కాలంలో ఇది సాగరాలను శాసించినట్లు అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తన సైంటిఫిక్ బులెటిన్‌లో ప్రచురించింది.

ఈ సముద్రపు జీవి చూడటానికి భారీ కొమోడో డ్రాగన్ మాదిరిగా ఉండేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. దీనికి పదునైన రంపపు పళ్లు ఉండేవి. ఈ దంతాలతో మాంసాన్ని సులభంగా చీల్చివేసేది. అత్యంత శక్తివంతమైన దవడలు, మెడ కండరాల సాయంతో పెద్ద జీవులను సైతం ఇది సులభంగా వేటాడేది. ఇప్పటివరకు లభించిన అతిపెద్ద 'టైలోసారస్ రెక్స్' శిలాజం పొడవు ఏకంగా 43 అడుగులు (13.2 మీటర్లు). భూమిపై జీవించిన అతిపెద్ద టి-రెక్స్ ('స్యూ' శిలాజం) కంటే ఇది పొడవైంది కావడం విశేషం.

టైలోసారస్ రెక్స్ అనేది 'మొససార్' కుటుంబానికి చెందిన సముద్ర సరీసృపం. ఇది ఉత్తర అమెరికా మధ్యలో ఉన్న 'వెస్టర్న్ ఇంటీరియర్ సీవే' అనే ప్రాచీన సముద్రంలో నివసించింది. దీని శిలాజాలు ఎక్కువగా టెక్సాస్‌లో లభించగా, అతిపెద్ద శిలాజం కాన్సాస్‌లో బయటపడింది. పెద్ద చేపలు, ఇతర సముద్ర జీవులు దీని ప్రధాన ఆహారం.

భూమిపై జీవించిన టైరనోసారస్ రెక్స్‌కు, ఈ సముద్ర జీవికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇవి రెండూ వేర్వేరు కాలాల్లో జీవించాయి. అయితే, లాటిన్‌లో 'రెక్స్' అంటే 'రాజు' అని అర్థం. భూమిపై టి-రెక్స్ ఎలా తిరుగులేనిదో, సముద్రంలో ఇది కూడా అలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని చెప్పడానికే శాస్త్రవేత్తలు దీనికి ఆ పేరు పెట్టారు.

Tylosaurus Rex
Sea Rex
Marine Reptile
Fossil Discovery
Cretaceous Period
American Museum of Natural History
Western Interior Seaway
Kansas Fossil
Texas Fossils
Sea Monster

More Telugu News