పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్ ఫ్రెండ్లీ ఛాలెంజ్!
- పెట్టుబడుల కోసం తమిళనాడు మంత్రి కీర్తన చేసిన ప్రచార వీడియో
- వీడియోపై స్పందించి పోటీకి సిద్ధమని ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
- ఏపీ, తమిళనాడు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని స్పష్టీకరణ
- పెట్టుబడులే ఉద్యోగాలు సృష్టిస్తాయని, ట్రోల్స్‌ను పట్టించుకోవద్దని హితవు
- లోకేశ్ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కీర్తన ప్రత్యుత్తరం
పొరుగు రాష్ట్రమైన తమిళనాడుతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా పోటీ పడుతుందని, ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు లోకేశ్ బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా పెట్టుబడుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ తప్పదని లోకేశ్ పరోక్షంగా సూచించారు.
అసలేం జరిగింది?
తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన, తమ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. "తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు, ఆ భవిష్యత్తును మేమే నిర్మిస్తున్నాం. సింగిల్ విండో విధానం, వేగవంతమైన అనుమతులు, ఏఐ నగరాలు, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తున్నాం" అంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
ఈ వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, కీర్తనను అభినందించారు. "కీర్తన గారూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు మీరు చూపుతున్న చొరవ అభినందనీయం. ప్రతి మంత్రి తమ రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. పెట్టుబడిదారులతో చర్చలు జరిపి, ఉపాధి కల్పించే వారిలో నమ్మకాన్ని నింపాలి. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు పోటీపడటాన్ని ప్రధాని మోదీ కూడా ప్రోత్సహిస్తారు" అని పేర్కొన్నారు.
అదే సమయంలో "ఆంధ్రప్రదేశ్ నిస్సందేహంగా తమిళనాడుకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ సోషల్ మీడియా గోలంతా పట్టించుకోవద్దు. ట్రోల్స్ ఉద్యోగాలు సృష్టించవు, పెట్టుబడులు మాత్రమే ఉద్యోగాలను సృష్టిస్తాయి" అంటూ చురక అంటించారు.
లోకేశ్ చేసిన ఈ పోస్టుపై మంత్రి కీర్తన కూడా హుందాగా స్పందించారు. "థ్యాంక్యూ లోకేశ్ గారు. తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా నా నియోజకవర్గ యువతకు అవకాశాలు కల్పించడానికి చిత్తశుద్ధితో, వినయంతో, పట్టుదలతో పనిచేస్తూనే ఉంటాను" అని ఆమె బదులిచ్చారు. మొత్తం మీద ఈ ట్వీట్ల సంభాషణ ద్వారా లోకేశ్.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మంత్రి కీర్తనలకు పెట్టుబడుల విషయంలో తాము గట్టి పోటీదారులమని స్పష్టమైన సంకేతాలు పంపారు.