లైకులు, ఫాలోవర్లే ఎర.. రీల్స్ చేసే యువతకు పాక్ గూఢచార సంస్థ వల!

  • సోషల్ మీడియా రీల్స్ చేసేవారిని లక్ష్యంగా చేసుకున్న ఐఎస్ఐ
  • లైకులు, ఫాలోవర్లు పెంచుతామని చెప్పి ఉచ్చులోకి లాగుతున్న వైనం
  • సున్నితమైన సమాచారం సేకరించమని ఒత్తిడి, బ్లాక్‌మెయిల్
  • ఇటీవల యూపీ యువకుడి అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చిన కుట్ర
  • 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్‌పై గూఢచర్యాన్ని పెంచిన పాక్
భారత్‌లో గూఢచర్యం కోసం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త, ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాలో పాప్యులారిటీ, లైకులు, ఫాలోవర్ల కోసం రీల్స్ చేసే యువతనే లక్ష్యంగా చేసుకుని వారిని గూఢచర్యం ఉచ్చులోకి లాగుతోంది. ఈ విధంగా దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని రాబడుతోంది. గత ఏడాది కాలంలో ఇలాంటి గూఢచర్యం కేసుల్లో అరెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగిందని భారత నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో ఉన్న కొందరు ఐఎస్ఐ హ్యాండ్లర్లు, రిక్రూటర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే, రీల్స్ చేసే వారిని నిరంతరం గమనిస్తుంటారు. వీరు వందల కొద్దీ నకిలీ ఖాతాలను సృష్టించి, లక్ష్యంగా చేసుకున్న వారి రీల్స్‌కు లైకులు, కామెంట్లు పెడుతూ ఎంగేజ్‌మెంట్ పెంచుతారు. నెమ్మదిగా వారితో సంభాషణలు మొదలుపెట్టి, మరింత మంది ఫాలోవర్లను అందిస్తామని నమ్మిస్తారు. ఈ ఆశకు చాలామంది యువత సులభంగా లొంగిపోతున్నారని ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.

మొదట వారిని ఏమి చేయాలో చెప్పకుండా, కేవలం కొన్ని నిర్దిష్ఠ‌ ప్రదేశాల్లో వీడియోలు తీసి పంపమని అడుగుతారు. అమాయకంగా వారు ఆ ఆదేశాలను పాటిస్తారు. ఆ తర్వాత చిన్న మొత్తంలో డబ్బు ఆశ చూపి, దేశ భద్రతకు సంబంధించిన కీలక ప్రదేశాలు, సైనిక కార్యకలాపాల గురించి సమాచారం ఇవ్వాలని కోరతారు. విషయం గ్రహించే లోపే వారు గూఢచర్యం ఉచ్చులో పూర్తిగా చిక్కుకుంటారు. ఇదివరకే పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లను డబ్బుతో ఆకర్షించిన ఐఎస్ఐ, ఇప్పుడు చిన్న రీల్స్ మేకర్లను 'ఎంగేజ్‌మెంట్' ఎరగా వాడుకుంటోందని అధికారులు చెబుతున్నారు.

ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన ఉత్తరప్రదేశ్ వాసి జైద్ ఖాన్ కేసు దీనికి స్పష్టమైన నిదర్శనం. సోషల్ మీడియాలో నిత్యం రీల్స్ పోస్ట్ చేసే జైద్‌ను రాణా హుస్సేన్, అవిద్ అనే ఇద్దరు వ్యక్తులు అనుసరించడం ప్రారంభించారు. అతని పోస్టులకు ఎంగేజ్‌మెంట్ పెంచడంతో వారి కోసం పనిచేయడానికి అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత సహాయకుడి మొబైల్ నంబర్, ఇతర క్యాబినెట్ మంత్రుల వివరాలు సేకరించాలని అతడిని ఆదేశించారు. దీనికి ప్రతిఫలంగా అతనికి ఒక పిస్టల్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.

భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ చేతిలో ఎదురైన పరాభవంతో పాకిస్థాన్ ప్రతీకారంతో రగిలిపోతోందని, భారత సైనిక రహస్యాలను తెలుసుకుని మన బలగాలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో గూఢచర్యాన్ని ముమ్మరం చేసిందని అధికారులు చెబుతున్నారు. రీల్స్‌పై ఉన్న మోజుతో చాలామంది యువత తాము చేస్తున్న పని తీవ్రతను గ్రహించడం లేదని, ఈ బలహీనతనే ఐఎస్ఐ పూర్తిగా వాడుకుంటోందని నిఘా ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఇన్‌ఫ్లుయెన్సర్లపైనే కాకుండా సాధారణ రీల్స్ మేకర్ల సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఇప్పుడు నిఘా పెంచారు.

ISI
Pakistan ISI
social media
spying
India
youth
reels
Zaid Khan
cyber security
intelligence

More Telugu News