జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే!

  • యువత జీతాల్లో తెలియకుండానే కోత పెడుతున్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు
  • చిన్న మొత్తాలే అయినా నెల చివరికి పెద్ద ఖర్చుగా మారుతున్న వైనం
  • 'యాప్ ట్రాప్' ఎకానమీపై ఆన్‌లైన్‌లో యువత మధ్య విస్తృత చర్చ
  • చాలా యాప్స్‌ను వాడకపోయినా ఆటో-డెబిట్ అవుతున్నాయని ఆవేదన
  • ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు
"ప్రతినెలా నా జీతం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. ఖరీదైన గ్యాడ్జెట్లు కొనలేదు, లగ్జరీ షాపింగ్‌లు చేయలేదు, అయినా డబ్బులు మాయమవుతున్నాయి" అంటూ హర్షిత్ శర్మ అనే యువ ఉద్యోగి రెడ్డిట్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ దేశంలోని అనేకమంది యువ ఉద్యోగుల అనుభవాలను ప్రతిబింబిస్తూ 'ఇన్విజిబుల్ స్పెండింగ్' లేదా 'యాప్ ట్రాప్' అనే కొత్త చర్చకు దారితీసింది.

హర్షిత్ తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు విషయం బోధపడింది. అతని జీతాన్ని దొంగిలిస్తున్నది ఒక్క పెద్ద ఖర్చు కాదు, అనేక చిన్న చిన్న నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు. స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, స్పాటిఫై.. ఇలా ప్రతి యాప్ కోసం చెల్లించే మొత్తం చిన్నదే. 'కేవలం రూ.99', 'రూ.149 మాత్రమే', 'స్టూడెంట్ ఆఫర్' అంటూ ఆకర్షణీయంగా కనిపించే ఈ చెల్లింపులన్నీ కలిపి నెల చివరికి పెద్ద మొత్తంగా మారుతున్నాయని అతను గ్రహించాడు. తాను డబ్బు కడుతున్న వాటిలో సగం యాప్స్‌ను కనీసం నెలలో ఒకటి, రెండుసార్లు కూడా తెరవలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

ఈ సమస్యపై ఢిల్లీలో పనిచేస్తున్న అంకిత జైస్వాల్ మాట్లాడుతూ.. "నేనొక సినీ ప్రియురాలిని. ఏ కొత్త సినిమా లేదా సిరీస్‌ను మిస్ కాకూడదనే ఉద్దేశంతో దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రయిబ్ చేశాను. కానీ, రోజంతా ఆఫీస్ పని తర్వాత అలసిపోయి, వాటిని చూసే ఓపిక ఉండేది కాదు. అయినా ప్రతినెలా డబ్బులు ఆటో-డెబిట్ అయ్యేవి. అనవసరంగా ఎంత డబ్బు వృధా అవుతుందో గ్రహించి, ఇప్పుడు చాలావాటిని రద్దు చేశాను. ప్రస్తుతం 'రొటేషన్ సిస్టమ్' పాటిస్తున్నా. అంటే.. ఒకేసారి ఒకే ఓటీటీకి సబ్‌స్క్రయిబ్ అవుతున్నాను" అని తన అనుభవాన్ని పంచుకుంది.

నిపుణులు ఈ ధోరణిని 'మైక్రో-స్పెండింగ్ ఫెటీగ్' అని పిలుస్తున్నారు. సాలరీసే సహ వ్యవస్థాపకుడు పియూష్ బగారియా ప్రకారం.. సౌలభ్యం కోసం రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌లు యువత ఆర్థిక నిర్వహణలో కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఆర్థిక అవగాహన, క్రమశిక్షణ ఇప్పుడు మరింత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

లెవెరేజ్డ్ గ్రోత్ సీఈఓ అశ్విని బజాజ్ మాట్లాడుతూ.. ఈ సమస్య కేవలం డబ్బుకు సంబంధించింది కాదని, సైకాలజీతో ముడిపడి ఉందని వివరించారు. వినియోగదారులను తమ ఉత్పత్తులకు బానిసలుగా మార్చడానికి కంపెనీలు ఎలా వ్యూహాలు పన్నుతాయో 'హుక్డ్' అనే పుస్తకాన్ని ఉదాహరణగా చూపారు. ఉచిత ట్రయల్ కోసం కార్డు వివరాలు తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఇదేనని, చాలామంది తర్వాత సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోరని ఆయన తెలిపారు. "ఆటో-డెబిట్‌లు మన ఖర్చును దాదాపుగా అదృశ్యం చేస్తాయి. ఈ చిన్న చిన్న లీకేజీలే క్రమంగా మన పొదుపును, ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తాయి" అని హెచ్చరించారు.

ఈ అనుభవాల నేపథ్యంలో చాలామంది యువత ఇప్పుడు మేల్కొంటున్నారు. ప్రతినెలా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను మాన్యువల్‌గా తనిఖీ చేసుకోవడం, ఉపయోగించని సర్వీసులను వెంటనే రద్దు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

App Trap
invisible spending
subscription services
OTT platforms
micro-spending fatigue
financial management
auto debit
Swiggy One
Zomato Gold
Harshith Sharma

More Telugu News