జగన్ పాలనలో బీసీల ఊచకోత.. మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Kollu Ravindra Fires at Jagan Regime at TDP Mahanadu
మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రసంగం
జగన్ పాలనలో బీసీల ఊచకోత జరిగిందని తీవ్ర ఆరోపణ
గత ఐదేళ్లలో ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టారని విమర్శ
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తెచ్చామని వెల్లడి
యువగళం హామీని లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడిన మంత్రి
టీడీపీ మహానాడు వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రంలో బీసీల ఊచకోత జరిగిందని ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై దాడులతో కుట్రపూరిత రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు.

తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారని, అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని రవీంద్ర స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాతే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. బడుగు వర్గాల కోసం 90 శాతం సబ్సిడీతో 'ఆదరణ' పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందించామని తెలిపారు.

యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు, టీడీపీ అధికారంలోకి రాగానే నారా లోకేష్ బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహానాడు కేవలం రాజకీయ వేదిక కాదని, తెలుగు జాతి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ప్రణాళిక అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

టీడీపీకి, పేదలకు ఉన్నది పేగుబంధం: మహానాడులో కాలవ శ్రీనివాసులు
తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ అని, తల్లికి, బిడ్డకు ఉండే పేగుబంధం కంటే పేదలకు, టీడీపీకి మధ్య ఉన్న బంధం బలమైనదని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. మహానాడు-2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ప్రసంగించారు. టీడీపీ ఎల్లప్పుడూ పేదల పక్షపాతి అని, ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

పింఛన్ల పెంపుపై మాట్లాడుతూ, రూ.4 వేలుగా ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.15 వేలకు పెంచి, ఒకప్పుడు కుటుంబానికి భారంగా భావించిన వారిని నేడు అదే కుటుంబానికి భరోసాగా మార్చామని చెప్పారు. పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కేవలం పింఛన్లే కాకుండా, గృహ నిర్మాణంలో కూడా రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.

చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 13 డీఎస్సీల ద్వారా 1.90 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని కాలవ శ్రీనివాసులు గుర్తుచేశారు. పేదలకు విద్యను దూరం చేసిన దుర్మార్గులకు ఇప్పుడు విద్య గురించి మాట్లాడే అర్హతే లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చంద్రబాబు నాయకత్వం మరో 15 సంవత్సరాలు అవసరమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kollu Ravindra
TDP Mahanadu
BC welfare
Jagan government
Andhra Pradesh politics
Telugu Desam Party
Nara Lokesh
Kalava Srinivasulu
BC protection act
Pension scheme

More Telugu News