ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే.. అసలు ఏం జరుగుతోంది?

  • కర్ణాటక కాంగ్రెస్ ప్రక్షాళనకు అధిష్ఠానం కసరత్తు
  • ఢిల్లీ చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • ఖర్గే నివాసంలో నేడు కీలక భేటీ
  • కర్ణాటక లీడర్‌షిప్ మార్పుపై ముమ్మర చర్చలు
  • త్వరలో రాజ్యసభ, మండలి స్థానాలకు ఎన్నికలు
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీ శ్రేణుల్లో భారీ మార్పులు చేపట్టేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ సమక్షంలో జరిగే కీలక భేటీలో ఈ మార్పులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పుడే ఎందుకు?
రాష్ట్రంలో పాలనను మరింత పటిష్ఠం చేయడానికి, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా చేరవేయడానికి ఈ మార్పులు అవసరమని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే దీని ఉద్దేశమని తెలుస్తోంది. మరోవైపు పొరుగు రాష్ట్రమైన కేరళ ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటక నాయకత్వ మార్పు అంశాన్ని పరిశీలిస్తామని గతంలో డీకే శివకుమార్‌కు పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కర్ణాటకపై అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం.

మూడు ప్రధాన వ్యూహాలు?

కేవలం మంత్రివర్గ ప్రక్షాళన
మొదటి వ్యూహం ప్రకారం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. సరిగ్గా పనిచేయని మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అహిందా (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు) సామాజిక వర్గాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు వినికిడి. డీకే శివకుమార్ సూచనలకు అనుగుణంగా ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సీఎంగా డీకే శివకుమార్‌?
రెండో ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి, సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపేలా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2023లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే రెండున్నరేళ్ల తర్వాత సీఎం సీటు ఇస్తామని శివకుమార్‌కు అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ మార్పు జరిగితే ఇరు వర్గాల నేతలతో కొత్త మంత్రివర్గాన్ని కూర్చవచ్చని తెలుస్తోంది.

తెరపైకి మల్లికార్జున ఖర్గే?
ఒకవేళ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడితే ఏకాభిప్రాయ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను రంగంలోకి దించే అవకాశాలూ లేకపోలేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కావాలనేది ఖర్గే సుదీర్ఘకాల స్వప్నమని సమాచారం. అయితే ఆయన్ను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి పంపితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ నిర్మాణాన్ని పునఃసమీక్షించాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్యసభ, కౌన్సిల్ ఎన్నికల హడావుడి
మరోవైపు రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు, తొమ్మిది శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ కావడం వల్ల అభ్యర్థుల ఎంపికపై కూడా ఢిల్లీలో కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తి చేసుకున్న తరుణంలో డీకే శివకుమార్ అనుచరులు సీఎం పదవి కోసం ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఢిల్లీ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Siddaramaiah
DK Shivakumar
Karnataka Congress
Mallikarjun Kharge
Karnataka Politics
Congress High Command
Cabinet Reshuffle
Rajya Sabha Elections
Leadership Change
Karnataka Government

More Telugu News