జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu Praises Vetoori Sundararama Murthy National Award Rejection
  • విశాఖలో ఘనంగా సినీ గేయరచయిత వేటూరి 16వ వర్ధంతి సభ
  • డాక్టర్ కె. రామాచారికి 'వేటూరి సాహిత్య పురస్కారం' అందజేత
  • తెలుగు భాష కోసం జాతీయ అవార్డును తిరస్కరించారని గుర్తు చేసుకున్న స్పీకర్ అయ్యన్న
  • వేటూరి ప్రతి పాట ఓ ఆణిముత్యమని కొనియాడిన హోంమంత్రి అనిత
  • ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
తెలుగు భాషను ప్రభుత్వాలు గుర్తించడం లేదన్న ఆవేదనతో, తనను వరించిన జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి సుందరరామమూర్తి అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సినీ గేయరచయిత వేటూరి 16వ వర్ధంతిని పురస్కరించుకుని నిన్న విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె. రామాచారికి 'వేటూరి సాహిత్య పురస్కారం' అందజేశారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ వేటూరి సుందరరామమూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, వేటూరి రాసిన వేల పాటల్లో ప్రతి పాటా ఓ ఆణిముత్యమని, అన్ని రకాల పాటలు రాసి మెప్పించిన గొప్ప కవి అని ప్రశంసించారు. వేటూరి పదాలకు ఎంత మాధుర్యం ఉంటుందో .. ఆయన సతీమణి సీతామహాలక్ష్మి మాటల్లో అంత ప్రశాంతత కనిపించిందన్నారు. వేటూరికి అంతటి పేరు, ప్రజల ప్రేమ రావడం వెనుక ఆమె అందించిన అండ, ఆత్మీయత, సహనం కూడా ఒక గొప్ప కారణమని పెద్దలు చెప్పడం నిజమేనని అనిపిస్తుందన్నారు. వేటూరిని స్మరించుకోవడం  కూడా ఒక అదృష్టమని, అలాంటి మహానుభావుడి జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన ఆమెను ఈ సందర్భంగా కలుసుకోవడం మరింత విలువైన క్షణంగా మిగిలిపోతుందని అన్నారు.

వేటూరితో ఎవరినీ పోల్చలేమని, ఆయన ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోతారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉచితంగా ఐదు వేల మందికి సంగీతం నేర్పుతున్న డాక్టర్ రామాచారిని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 'మనసవీణ మధుగీతం' పేరిట వేటూరి పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్, కనక మహాలక్ష్మి ఆలయ ఛైర్మన్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 
Go Back to Shorts
Vetoori Sundararama Murthy
Veturi
Ayyanna Patrudu
Telugu language
National Award
Andhra Pradesh
K Ramachari
VangalaPudi Anita
Ganta Srinivasa Rao
Visakhapatnam

More Telugu News