- 'బాహుబలి' కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమన్న తమన్నా
- ప్రాంతీయ భాషకు చెందిన సినిమాను రూ. 200 కోట్లతో తీయడం సాధారణ విషయం కాదని వ్యాఖ్య
- ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి చిత్రాన్ని నిర్మించారన్న తమన్నా
ఒకప్పుడు టాప్ స్టార్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ అగ్ర తారగా ఒక వెలుగు వెలిగింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్‌లోనే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. తాజాగా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన ‘బాహుబలి’ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నా తన ఇంటర్వ్యూలో బాహుబలి బడ్జెట్, ట్రేడ్ రిస్క్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోంది. కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే రూ. 200 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదు. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి వ్యాపార పరంగా చూస్తే.. అది ఫ్లాప్‌కు దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్గం లాగా అనిపించింది. కానీ ఆ రోజుల్లో రాజమౌళి తన విజన్‌ను నమ్మారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే, అంతటి అద్భుతమైన గ్లోబల్ విజయాన్ని సాధించింది. లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి" అని తమన్నా జక్కన్న విజన్‌ను కొనియాడింది.