కాళ్లు లేకపోయినా కొండంత సంకల్పం ఉంది.. చేతులతోనే ఎవరెస్ట్‌ పైకి!

Rustam Nabiev Conquers Everest With Hands After Losing Legs
  • రష్యా మాజీ సైనికుడి సరికొత్త రికార్డు
  • కేవలం చేతుల బలంతోనే ఎవరెస్ట్‌ పైకి
  • ప్రమాదంలో కాళ్లు పోయినా ధైర్యం వీడలేదు
  • కృత్రిమ కాళ్లు కూడా ఉపయోగించకుండా ఎక్కారు
  • ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని పిలుపు 
పడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోలేదని.. ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని ప్రపంచానికి చాటిచెప్పాడు ఓ మాజీ సైనికుడు. రెండు కాళ్లు లేకపోయినా.. కేవలం చేతుల బలంతోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి స్ఫూర్తిగా నిలిచాడు రష్యాకు చెందిన రుస్తమ్‌ నబీవ్‌. మానవ చరిత్రలో నిలిచిపోయేలా సాగిన ఈ స్ఫూర్తిమంతమైన యాత్ర వివరాలు..

కూలిన బ్యారెక్స్
రష్యాకు చెందిన రుస్తమ్ నబీవ్ ఒకప్పుడు పారాట్రూపర్‌గా సైన్యంలో పనిచేశారు. 2015లో ఆయన నిద్రిస్తున్న మిలిటరీ బ్యారెక్స్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. రుస్తమ్ తన రెండు కాళ్లను కోల్పోయారు. ఆ విపత్కర పరిస్థితిలో కుంగిపోకుండా.. పర్వతారోహణ వైపు అడుగులు వేస్తూ తన జీవితాన్ని సరికొత్తగా మలుచుకున్నారు.

చేతుల బలంతోనే
రెండు కాళ్లు లేని ఓ వ్యక్తి, ఎలాంటి కృత్రిమ కాళ్లు వాడకుండా కేవలం చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కి చరిత్ర సృష్టించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ప్రస్తుత స్ప్రింగ్ క్లైంబింగ్ సీజన్‌లో భాగంగా నేపాల్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:16 గంటలకు రుస్తమ్ ఈ అసాధ్యమైన రికార్డును సుసాధ్యం చేశారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కోఆర్డినేటర్ ఖిమ్ లాల్ గౌతమ్ కూడా ఈ విజయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

ఎవరెస్ట్ పైనుంచి సందేశం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత రుస్తమ్ అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘జీవితం ముగిసిపోయిందని అనుకునే వారి కోసం.. రుస్తమ్ నబీవ్, ఎవరెస్ట్ 2026’’ అని రాసి ఉన్న సందేశాన్ని అందులో చూడొచ్చు. ఈ విజయాన్ని తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

సోషల్ మీడియా సెల్యూట్‌
‘‘మనలో ఉన్న గొప్ప శక్తే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సాధ్యమేనని నువ్వు నిరూపించావు’’ అంటూ నెటిజన్లు రుస్తమ్ విజయాన్ని కొనియాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మోటివేటర్ అంటూ నెటిజన్లు అతనిపై అభినందనలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రుస్తమ్ ఎవరెస్ట్ శిఖరం నుంచి బేస్ క్యాంప్‌నకు సురక్షితంగా తిరిగి వస్తున్నారు.
Go Back to Shorts
Rustam Nabiev
Everest
Mount Everest
climber
paratrooper
Russia
hand cycling
motivation
inspiration
Nepal

More Telugu News