చనిపోయిన నా చెల్లిపై నిందలా?.. ట్విషా శర్మ సోదరుడి ఆగ్రహం

Harshit Sharma Fires at Former Judge Over Sisters Death
  • నోయిడా యువతి ట్విషా శర్మ మృతి కేసులో తీవ్ర ఆరోపణలు
  • తన సోదరిపై అత్త వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్న మేజర్ హర్షిత్ 
  • మాజీ జడ్జి అయిన అత్త న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
  • దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అత్తింటివారు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన
  • అత్తకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టులో సవాల్ చేస్తామని వెల్లడి
నోయిడాకు చెందిన ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌పై ట్విషా సోదరుడు, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మేజర్ హర్షిత్ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చనిపోయిన తన సోదరిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరి అత్తది ‘ఊహకందని స్థాయి క్రూరత్వం’ అని ఆయన అభివర్ణించారు.

‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేజర్ హర్షిత్ శర్మ మాట్లాడుతూ.. "ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలరో అర్థం కావట్లేదు. నా సోదరి బతికున్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా ఆమె ప్రవర్తిస్తున్నారు" అని అన్నారు. మాజీ జడ్జి అయిన గిరిబాలా సింగ్ తన హోదాను అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

"బెయిల్ నిబంధనలను ఆ మాజీ జడ్జికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదు, చనిపోయిన నా సోదరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ప్రజల దృష్టిని, దర్యాప్తు ఏజెన్సీల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చట్టాల ఆధారంగా ఆమె తీర్పులు ఇచ్చారో, ఆ చట్టాలనే ఆమె ఇప్పుడు మరచిపోయారు" అంటూ మేజర్ హర్షిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు బెయిల్ ఎలా మంజూరైందని, బెయిల్ తర్వాత ఆమె చర్యలను ఎలా సమర్థించుకుంటున్నారని, ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ట్విషా భర్త సమర్థ్ సింగ్, అతని కుటుంబ సభ్యుల పలుకుబడి కారణంగా దర్యాప్తు ఇప్పటికే ప్రభావితమైందని, ఇది కేవలం భయం కాదని, వాస్తవమని ఆయన అన్నారు. "ఒకటి, రెండు యాదృచ్ఛికంగా జరిగితే అంగీకరించవచ్చు. కానీ వరుసగా అన్నీ యాదృచ్ఛికంగానే జరుగుతుంటే, అవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. వాస్తవాలను మార్చడానికి, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి పదేపదే చేస్తున్న ప్రయత్నాలే" అని ఆయన స్పష్టం చేశారు.

తన సోదరి వ్యక్తిత్వం గురించి అత్తగారు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని, అయితే అత్తింట్లో ఆమె ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులను ఎదుర్కొందని వివరించారు. "ఒక బిడ్డను కనాలనుకుంటున్న మహిళ శీలాన్ని భర్తే కాకుండా అత్త కూడా శంకించడం ఎంత దారుణం? ఆ ఇంట్లో ఉంటున్న ముగ్గురిలో ఇద్దరు ఆమె పుట్టబోయే బిడ్డ గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి అనుమానిస్తుంటే, అలాంటి ఉక్కిరిబిక్కిరి వాతావరణంలో ఏ మహిళ అయినా బిడ్డకు ఎలా జన్మనిస్తుంది?" అని మేజర్ హర్షిత్ ఆవేదనతో ప్రశ్నించారు.

గిరిబాలా సింగ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ "ఆమె ఒక మూలకు నెట్టబడిన జంతువులా ప్రవర్తిస్తోంది. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే స్పష్టత లేదు. మేం న్యాయపోరాటంపై దృష్టి పెట్టాం, ఆమె చేసే వ్యాఖ్యలపై కాదు" అని స్పష్టం చేశారు. 

మరోవైపు, ట్విషా కుటుంబ సభ్యులు ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితుల పలుకుబడి కారణంగా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిబాలా సింగ్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. కోర్టుకు సమర్పించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును బలోపేతం చేయాల్సి ఉండగా, ఆ క్లిప్పులన్నీ నిందితుల వద్దే ఉన్నాయని ట్విషా కజిన్ ఆశిష్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Harshit Sharma
Twisha Sharma
Giribala Singh
Noida
Dowry death
Indian Army
Murder investigation
Justice system
CCTV footage
Madhya Pradesh High Court

More Telugu News