గుజరాత్ టాపార్డర్ ఊచకోత... సీఎస్కే ముందు భారీ టార్గెట్

  • చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
  • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన జీటీ
  • గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ అద్భుత హాఫ్ సెంచరీలు
  • తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు
  • గుజరాత్ బ్యాటర్ల ధాటికి తేలిపోయిన చెన్నై బౌలర్లు
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (64), సాయి సుదర్శన్ (84), జోస్ బట్లర్ (57*) హాఫ్ సెంచరీలతో చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో చెన్నై ముందు 230 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ పోటీపడి బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన గిల్ ఔటయ్యాక, సుదర్శన్ తన జోరు కొనసాగించాడు. మరోవైపు, క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ వీరవిహారం చేశాడు. 

సాయి సుదర్శన్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, చివరి వరకు క్రీజులో ఉన్న బట్లర్ కేవలం 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 57 పరుగులు చేసి గుజరాత్‌కు భారీ స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. అన్షుల్ కంబోజ్ 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించుకోగా, స్పెన్సర్ జాన్సన్ 47 పరుగులు ఇచ్చాడు. 

Shubman Gill
Gujarat Titans
Chennai Super Kings
Sai Sudharsan
IPL 2024
Narendra Modi Stadium
Josh Buttler
T20 Cricket
IPL Scores
Ahmedabad

More Telugu News