మండుతున్న ఎండలు.. శరీరంలో ఈ లక్షణాలను అస్సలు లైట్‌ తీసుకోవద్దు!

  • ఉష్ణోగ్రతలు పెరిగితే వడదెబ్బ తగిలే ముప్పు
  • అవయవాలు దెబ్బతినే ప్రమాదకర స్థితి
  • గందరగోళం, అపస్మారక స్థితి
  • సొంత వైద్యం చేయొద్దు
  • తడిగుడ్డ, ఐస్‌తో శరీరాన్ని చల్లబర్చాలి
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. ఈ తరుణంలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒంట్లో వచ్చే నీరసాన్ని మామూలు అలసటగా భావించి నిర్లక్ష్యం చేయొద్దని, వడదెబ్బ నిమిషాల్లోనే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం

  • కళ్లు తిరగడం
  • విపరీతమైన తలనొప్పి
  • వాంతులు, వికారం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • కండరాల నొప్పులు
  • ఎక్కువ వేడిగా అనిపించడం
  • విపరీతంగా చెమటలు పట్టడం

మెదడుపై పడే తీవ్ర ప్రభావం
పరిస్థితి విషమిస్తే వడదెబ్బ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. బాధితుల్లో గందరగోళం పెరగడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియని స్థితికి వెళ్లడం వంటివి జరుగుతాయి. ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. లేదంటే మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

వీరికి ముప్పు చాలా ఎక్కువ
ఈ మండుతున్న ఎండల వల్ల కొందరు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గుండెజబ్బులు, షుగర్ ఉన్నవారికి వడదెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రథమ చికిత్స
  • బాధితుడిని నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి చేర్చాలి.
  • ఒంటిపై ఉన్న బట్టలను వదులు చేయాలి.
  • తడి గుడ్డతో శరీరాన్ని తుడవాలి.
  • మెడ, చంకల్లో ఐస్ ప్యాక్‌లు పెట్టాలి.
  • మనిషి పూర్తి స్పృహలో ఉంటేనే తాగడానికి నీళ్లు ఇవ్వాలి.
  • సొంత వైద్యం అస్సలు చేయొద్దు.
  • పారాసిటమాల్ మాత్రలు అస్సలు వేయొద్దు.

Heat Stroke
Heatwave
Summer
Dehydration
Health
Symptoms
Treatment
First Aid
Telangana
Andhra Pradesh

More Telugu News