అమెరికాలో అత్యల్ప ఆదాయవర్గాలకు పన్ను రద్దు చేయాలి: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ డిమాండ్

  • క్వీన్స్‌లో పనిచేసే నర్సు నెలకు వేయి డాలర్లకు పైగా పన్ను కట్టడం సరికాదని వ్యాఖ్య‌
  • ప్రభుత్వానికి అది చిన్న మొత్తమే అయినా, కష్టాల్లో ఉన్న ప్రజలకు పెద్ద భారమన్న బెజోస్  
  • కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్ను ప్రతిపాదన వేళ బెజోస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్నుడు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో అత్యల్ప ఆదాయం ఉన్న వారిలో సగం మంది ప్రజలకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండకూడదని ఆయన గట్టిగా వాదించారు. నిన్న‌ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై పన్ను విధించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

"దేశంలో చాలా మంది బాగా సంపాదిస్తున్నారు. కానీ, అదే సమయంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు" అని బెజోస్ అన్నారు. క్వీన్స్‌లో ఏడాదికి 75,000 డాల‌ర్లు సంపాదించే ఒక నర్సు, నెలకు 1,000 డాల‌ర్లకు పైగా పన్ను ఎందుకు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బు వారి అద్దె, నిత్యావసరాలు లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. "మొత్తం పన్ను రాబడిలో ఒక శాతం మంది పన్ను చెల్లింపుదారులు 40 శాతం వాటాను అందిస్తుంటే, దిగువన ఉన్న సగం మంది కేవలం మూడు శాతం మాత్రమే చెల్లిస్తున్నారు. నా ఉద్దేశంలో అది సున్నాగా ఉండాలి" అని బెజోస్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఇది చాలా చిన్న మొత్తమే అయినా, ప్రజలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన వివరించారు. ఏడాదికి 50,000 డాల‌ర్లు సంపాదించే అమెజాన్ ఉద్యోగిపై పన్ను విధించడం 'అసంబద్ధం' అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెజాన్‌లో కార్మికుల పరిస్థితిపై తీవ్ర విమర్శలు 
అయితే, జెఫ్ బెజోస్ పేదల పన్ను భారం గురించి మాట్లాడుతున్నప్పటికీ ఆయన సంస్థ అమెజాన్‌లో కార్మికుల పరిస్థితిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అమెజాన్ డెలివరీ డ్రైవర్లకు, యూనియన్ సభ్యులైన యూపీఎస్ డ్రైవర్లకు మధ్య జీతాల్లో భారీ వ్యత్యాసం ఉంది. యూపీఎస్ డ్రైవర్లు గంటకు 35 డాల‌ర్లు సంపాదిస్తుంటే, అమెజాన్ డ్రైవర్లు సగటున గంటకు 19 డాల‌ర్లు మాత్రమే పొందుతున్నారు. దీని కారణంగా 26 శాతం మంది అమెజాన్ కొరియర్ ఉద్యోగులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని, 33 శాతం మంది కనీస బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది.

ప్రస్తుతం కాలిఫోర్నియాలో బిలియనీర్లపై ప్రత్యేక పన్ను విధించాలనే ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో బెజోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం, 1 బిలియన్ డాల‌ర్ల కంటే ఎక్కువ ఆస్తులున్న వారిపై ఒకేసారి ఐదు శాతం పన్ను విధించాలని యోచిస్తున్నారు. ఈ సమయంలో బెజోస్ చేసిన వ్యాఖ్యలు అటు మద్దతు, ఇటు విమర్శలను ఎదుర్కొంటున్నాయి.

Jeff Bezos
Amazon
US Tax
Tax cuts
American Economy
Income Tax
Billionaires Tax
UPS Drivers
Amazon Workers
California Tax

More Telugu News