ప్రతిసారి మగాడిదే తప్పని చెప్పలేం: జయం రవికి అండగా మీరా చోప్రా
- సంచలనంగా మారిన జయం రవి విడాకుల వ్యవహారం
- రవికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఇండస్ట్రీ చీలిపోయే పరిస్థితి
- మహిళా చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్న మీరా చోప్రా
తమిళ చిత్ర పరిశ్రమలో (కోలీవుడ్) నటుడు జయం రవి విడాకుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారడమే కాకుండా, పరిశ్రమలోని ప్రముఖులు ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా చీలిపోయే పరిస్థితిని తెచ్చింది. విడాకులు మంజూరయ్యే వరకు తాను సినిమాల్లో నటించనని, తన చిత్రాలను విడుదల చేయనివ్వనని జయం రవి ప్రకటించడం, పెళ్లయిన నాటి నుంచి తాను నరకం అనుభవించానని మీడియా ముందు కన్నీరు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దీనికి తోడు, జయం రవితో లింక్ చేస్తూ ప్రచారంలోకి వచ్చిన గాయని కెనీషా.. నాటకీయంగా ఆయనతో తన అనుబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశానని ప్రకటించింది. మరోవైపు జయం రవి భార్య ఆర్తి ‘నిద్రపోతున్న సింహాన్ని లేపవద్దు’ అంటూ హెచ్చరించడం, ఆమెకు సీనియర్ నటి ఖుష్బూ మద్దతుగా నిలవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఈ నేపథ్యంలో ఒకప్పటి కథానాయిక మీరా చోప్రా జయం రవికి బాసటగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. జయం రవితో సౌత్ సినిమాల్లో నటించే సమయం నుంచి తనకు మంచి పరిచయం ఉందని మీరా చోప్రా గుర్తుచేసుకున్నారు. జయం రవి విడాకుల వార్తలపై స్పందిస్తూ.. "ప్రతిసారి తప్పు మగవాడిదే అని చెప్పలేం. మహిళల పక్షాన ఉన్న చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తున్న సందర్భాలను కూడా నేను చూశాను. కాబట్టి పురుషుడి వైపు ఉన్న వాదనను కూడా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసినంత వరకు జయం రవి చాలా మంచి వ్యక్తి. ఆయన విషయంలో నిజం గెలుస్తుందని, న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాను" అని ఎక్స్ వేదికగా జయం రవికి పూర్తి మద్దతు ప్రకటించారు.
మీరా చోప్రా సినీ నేపథ్యం: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన 'అన్బే ఆరుయిరే' చిత్రంతో మీరా చోప్రా కోలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో 'బంగారం', 'వాన' వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. గతంలో ఒక సినిమా దర్శక, నిర్మాతలపై ఆమె చేసిన పోరాటం అప్పట్లో మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాలకు దూరమై బాలీవుడ్ (హిందీ) వైపు దృష్టి సారించిన ఆమె, ఇటీవల విడుదలైన సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'కు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు.