నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తమిళ సినీ నిర్మాత

  • చెన్నైలో అడయార్ నదిలో దూకి తమిళ నిర్మాత కె. రాజన్ ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులే కారణమని ప్రచారం
  • నదిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • కె. రాజన్ మృతి పట్ల తమిళ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం, కె. రాజన్ తన డ్రైవర్‌తో కలిసి కారులో వంతెన వద్దకు చేరుకున్నారు. కాసేపు వాకింగ్ చేసి వస్తానని డ్రైవర్‌కు చెప్పి, వంతెనపైకి నడుచుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా నదిలోకి దూకేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రాజన్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, అప్పుల బాధతోనే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అడయార్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా సుపరిచితుడైన రాజన్ మృతి పట్ల సినీ రంగ ప్రముఖులు పలువురు సంతాపం ప్రకటించారు.

1983లో బ్రమ్మచారిగళ్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజన్ .. ఆవళ్ పాపం, నినైక్కాద నాళిలై తదితర చిత్రాలను నిర్మించారు. నటనపై ఆసక్తితో పాంబు సట్టై తుణివు, బకాసురన్ తదితర 18 చిత్రాల్లో ఆయన నటించారు. శరత్ కుమార్, నిళల్గళ్ రవి నటించిన నమ్మ ఊరు మరియమ్మ, ఉణర్చిగళ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1991లో విడుదలైన తంగమాన తంగచ్చి, చిన్నవూవై కిళ్లాదే చిత్రాలకు కథా రచయితగా కూడా పని చేశారు.

K Rajan
Tamil film producer
Tamil cinema
Adyar River
Suicide
Chennai
Tamil movie director
Producer suicide
Kollywood
Tamil film industry

More Telugu News