చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా

  • చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది'
  • సినిమా కథను చరణ్ మాత్రమే విన్నారన్న బుచ్చిబాబు
  • తనపై చరణ్ పూర్తి నమ్మకాన్ని ఉంచారని వెల్లడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్ అప్పుడే వేడి పుట్టిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన విధానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.


సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి కథ విన్న తర్వాతే రామ్ చరణ్ సినిమాలు ఓకే అవుతాయనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే ‘పెద్ది’ సినిమా విషయంలో అలా జరగలేదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఈ కథకు సంబంధించిన పూర్తి నిర్ణయాన్ని రామ్ చరణ్ సొంతంగా తీసుకున్నారని ఆయన వెల్లడించారు. తాను చరణ్ కు స్క్రిప్ట్ వినిపించగానే, ఆయన ఎంతో ఎమోషనల్ అయి వెంటనే తనను గట్టిగా హగ్ చేసుకున్నారని, "మనం ఈ సినిమా చేస్తున్నాం" అని అక్కడికక్కడే ప్రాజెక్ట్ లాక్ చేశారని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు.


మరో విశేషం ఏమిటంటే, గతంలో బుచ్చిబాబు తన మొదటి సినిమా ‘ఉప్పెన’ కథను చిరంజీవికి వినిపించారు కానీ... ‘పెద్ది’ కథను మాత్రం ఆయనకు చెప్పలేదు. తన గురువు సుకుమార్ కూడా ‘రంగస్థలం’ కథను మొదట చిరంజీవికి వినిపించారని, కానీ చరణ్ తనపై ఉంచిన నమ్మకంతో చిరంజీవికి కథ చెప్పమని ఒక్కసారి కూడా అడగలేదని బుచ్చిబాబు అన్నారు. ప్రాజెక్ట్ మొత్తం ఖరారైన తర్వాతే చిరంజీవి ముక్కలు ముక్కలుగా కథలోని కొన్ని భాగాలను అడిగి తెలుసుకున్నారని, అయితే మెగాస్టార్‌కు ఈ సినిమాను ఒకేసారి థియేటర్ స్క్రీన్‌పై చూపించి ఆయన రియాక్షన్ చూడాలనేది తన ప్లాన్ అని దర్శకుడు పేర్కొన్నారు.


విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ఒక క్రికెటర్‌గా, అలాగే పహిల్వాన్‌గా రెండు విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రీమియర్ షోలతో ప్రారంభమై, జూన్ 4న బహుభాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.


Ram Charan
Peddi Movie
Buchi Babu Sana
Chiranjeevi
Janhvi Kapoor
AR Rahman
Sukumar
Telugu Cinema
Sports Action Drama
Shivrajkumar

More Telugu News