నేటి యువతకు లవ్, రిలేషన్ అంటే ఏమిటో తెలియదు: తమన్నా
- ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే పుట్టేది కాదన్న తమన్నా
- ఒక వ్యక్తిని పూర్తిగా ప్రేమిస్తే వారిక పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వ్యాఖ్య
- మన భావాలను బలవంతంగా ప్రేమించిన వారిపై రుద్దకూడదన్న తమన్నా
హీరోయిన్ తమన్నా భాటియా నేటితరం యువతకు ప్రేమ, బంధాల (రిలేషన్స్) పై సరికొత్త లెక్చర్లు ఇస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ అయినప్పటి నుంచి ఆమె సమయం దొరికినప్పుడల్లా ప్రేమకు సంబంధించిన తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు వీరిద్దరి బంధం పెళ్లి వరకు వెళుతుందని అందరూ అనుకుంటే, ఎందుకు సడన్‌గా విడిపోయింది, తమన్నాను విజయ్ వర్మ ఏమైనా అనుమానించారా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాలను ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా బయటపెట్టనప్పటికీ, తాజాగా తమన్నా చేసిన వ్యాఖ్యలు వారి బ్రేకప్ కారణాలపై పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే కాదు, పలుమార్లు పుట్టవచ్చని మరియు అదే నిజమైన ప్రేమ అని వ్యాఖ్యానించారు. నేటితరం యువతకు లవ్, రిలేషన్ అంటే సరిగ్గా తెలియక గందరగోళానికి గురవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, మన భావాలను వారిపై బలవంతంగా రుద్దడం ద్వారా ప్రేమను నిరూపించుకోలేమని స్పష్టం చేశారు. ప్రేమ అనేది కేవలం ఒకే ఒకసారి కలిగే అనుభవం కాదని, అది జీవితంలో అనేకసార్లు జరగాల్సిన ప్రేరణ అని పేర్కొంటూ, ఇది బహిరంగంగా హావభావాల ద్వారా వ్యక్తపరిచేది కాదని, అంతర్లీనంగా పుట్టే ఒక భావోద్వేగమని తమన్నా వివరించారు. ఆమె చెబుతున్న ఈ మాటలను బట్టి చూస్తే, ప్రేమ విషయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోంది.