కెనీషాతో బ్రేకప్... ఆ మూడక్షరాల 'ఇడ్లీ' నటి నా జీవితం నాశనం చేసింది: జయం రవి

  • తమ ప్రేమాయణానికి బ్రేకప్ చెప్పిన కెనీషా
  • మీడియా ముందుకు వచ్చిన జయం రవి
  • 14 ఏళ్ల వైవాహిక జీవితంలో బానిసలా బతికానని ఆవేదన 
  • ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని ఆరోపణ 
తమిళ స్టార్ హీరో జయం రవి మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం అయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను, ఆవేదనను వెళ్లగక్కుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రియురాలు, సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌ తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, తొలిసారిగా మౌనం వీడి తన గోడును వెల్లబోసుకున్నారు.

భార్య ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత, ఆ విడాకులకు కెనీషానే కారణమంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఈ వేధింపులు, హత్య బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా, ఈ వివాదం నుంచి తప్పుకుంటున్నట్లు, చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జయం రవి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను బయటపెట్టారు.

"గడిచిన 14 ఏళ్ల నా వైవాహిక జీవితంలో ఓ బానిసలా బతికాను. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ నా భార్య వైపు వాళ్లు తీసుకున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నా డబ్బును నా ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు" అంటూ జయం రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి, ఆమెను దూరం చేశారని మండిపడ్డారు. "సినిమాల్లో మహిళల హక్కుల గురించి మాట్లాడే నేను, వారిని ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. ఈ 45 ఏళ్ల వయసులో నాకు అమ్మాయిల వెంట పడాల్సిన ఖర్మ పట్టలేదు. నా పిల్లల కోసమే ఇన్నాళ్లూ బతికాను. కానీ ఇప్పుడు వాళ్లను కూడా నన్ను చూడనివ్వడం లేదు. స్కూల్‌కు సెక్యూరిటీ గార్డుల కాపలాతో పంపుతున్నారు. నా పిల్లల భవిష్యత్తు గురించే ఇన్నాళ్లు నోరు మూసుకుని ఉన్నాను" అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.

ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని, ఆమె తన జీవితాన్ని నాశనం చేసిందని జయం రవి సంచలన ఆరోపణలు చేశారు. "ఆ 'మూడక్షరాల ఇడ్లీ నటి' నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె ఎన్ని కుటుంబాలను కూల్చిందో చెప్పమంటారా? నేను అనుకుంటే ఒక్కరోజులో విడాకులు తీసుకునేవాడిని. కానీ పిల్లల కోసం మౌనంగా ఉన్నాను. ఇకపై నన్ను రెచ్చగొట్టవద్దు," అని హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకున్న తర్వాతే మళ్లీ సినిమాల్లోకి వస్తానని, అంతవరకు నటించనని జయం రవి స్పష్టం చేశారు. ఆయన ఆరోపించిన ఆ 'మూడక్షరాల నటి' ఎవరనే దానిపై ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Jayam Ravi
Kenisha Francis
Kollywood
Divorce
Tamil actor
Idli actress
Personal life
Controversy
Financial issues
Family dispute

More Telugu News