బండ్ల గణేష్ తో వివాదంపై మరోసారి స్పందించిన నిర్మాత పీవీపీ

  • బ్యాంకు తరహా వడ్డీకి అప్పు ఇచ్చినట్లు వెల్లడి
  • దానిని వసూలు చేసుకోవాలనుకుంటే ఇబ్బంది తలెత్తిందన్న పీవీపీ
  • చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు అని అభిప్రాయం
జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా సమయంలో నిర్మాత బండ్ల గణేశ్‌తో వివాదంపై పీవీపీ వెంచర్స్ అధినేత, నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి స్పందించారు. టెంపర్ చిత్రానికి తాను ఒక్కడినే ఫైనాన్షియర్‌నని, బ్యాంకు తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి కూడా దానిని వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. కానీ మన డబ్బు మనం తీసుకోవడానికి కూడా అవమానాలు పడాల్సిన అవసరమేమిటని వ్యాఖ్యానించారు.

ప్రసాద్ వి.పొట్లూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్‌ను వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు. సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన వ్యాపారం మరొకటి లేదని అన్నారు. మనం డబ్బులు పెట్టి అవమానాల పడటం ఎందుకని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే అశుద్ధం వేసుకున్నట్లని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో నిర్మాతను ఒక జోకర్‌లా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్లాది రూపాయల డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీదనే, సెట్‌లో జోకులు వేసుకుంటారని అన్నారు. సినిమా బాగా ఆడకపోతే లేదా కలెక్షన్లు రాకపోతే రోడ్డు మీద పడేది నిర్మాత మాత్రమే అన్నారు. మిగిలిన వారికి పెద్దగా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్‌లో ఉన్నట్లు ఇక్కడ స్టూడియో విధానం లేదని అన్నారు. మన వద్ద హీరోలే పరిశ్రమను నడిపిస్తున్నారని, నిర్మాతలకు మాత్రం విలువ లేదని వాపోయారు. అలాంటి చోట ఉండటం ఇష్టం లేక తాను పరిశ్రను వదిలేశానని అన్నారు.

PVV Prasad V Potluri
Bandla Ganesh
Temper Movie
Jr NTR
Telugu Film Industry
Telugu Cinema

More Telugu News