హిందువునని నిరూపించుకోవడానికి రోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఒక దీపం వెలిగిస్తే చాలు: సుప్రీంకోర్టు
- ఆలయాల్లో మహిళల వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
- విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మండి జడ్జిల బెంచ్
- హిందూ మతం అనేది ఒక జీవన విధానం అన్న జస్టిస్ నాగరత్న
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిందూ మతం, విశ్వాసాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. మతం అంటే కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదని, అది ఒక అంతర్గత విశ్వాసం అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
శబరిమల వంటి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హిందువుగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రతిరోజూ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా అది ఆ వ్యక్తి మతాన్ని, విశ్వాసాన్ని చాటిచెప్పడానికి సరిపోతుందని సీజేఐ పేర్కొన్నారు.
ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ.. హిందూ మతం అనేది ఒక పద్ధతికి లోబడిన మతం కాదని, అది ఒక జీవన విధానమని అభివర్ణించారు. ఆచారాలను కచ్చితంగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదని, ఆచారబద్ధంగా లేకపోయినా ఒక వ్యక్తికి మతంపై విశ్వాసం ఉండవచ్చని ఆమె స్పష్టం చేశారు.
ప్రతి చిన్న మతపరమైన ఆచారాన్ని లేదా విషయాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించడం ప్రారంభిస్తే, అది మతాల పతనానికి దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల వల్ల కోర్టులపై భారం పెరగడమే కాకుండా, మతపరమైన సామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.