మన 'ధురంధర్'కు కౌంటర్ గా పాకిస్థాన్ 'మేరా ల్యారీ'... 22 టికెట్లకే థియేటర్ల నుంచి ఎత్తేశారు!

  • భారత చిత్రం ‘ధురంధర్’కు పోటీగా పాక్‌లో రూపొందిన ‘మేరా ల్యారీ’
  • బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన చిత్రం
  • కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని స్థానిక మీడియా కథనాలు
  • ప్రేక్షకులు లేకపోవడంతో తొలిరోజే థియేటర్ల నుంచి తొలగింపు
  • ప్రభుత్వ మద్దతు ఉన్నప్పటికీ సినిమాకు దక్కని ఆదరణ
భారత సినిమాకు దీటుగా సమాధానం చెప్పాలనే లక్ష్యంతో పాకిస్థాన్‌లో రూపొందించిన ఓ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలోని భారత చిత్రం ‘ధురంధర్’కు ప్రతిస్పందనగా వచ్చిన ‘మేరా ల్యారీ’ అనే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కనీస ఆదరణ కూడా లభించలేదు. కొన్ని థియేటర్లలో కేవలం 22 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, దీంతో షోలను రద్దు చేసి సినిమాను ప్రదర్శనల నుంచి తొలగించారని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కరాచీలోని ల్యారీ ప్రాంతాన్ని ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపెట్టి భారత చిత్రం ‘ధురంధర్’లో చూపించారని, దానికి భిన్నంగా ఆ ప్రాంత సానుకూల కోణాన్ని, ముఖ్యంగా మహిళల ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ‘మేరా ల్యారీ’ని తెరకెక్కించారు. అబు అలీహా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ నెల‌ 8న విడుదలైన ఈ సినిమా మొద‌టిరోజే తేలిపోయింది. ప్రేక్షకులు లేకపోవడంతో చాలా చోట్ల తొలిరోజే ప్రదర్శనలు నిలిపివేసి, దాని స్థానంలో ఇతర చిత్రాలను ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

విడుదలకు ముందు ఈ సినిమాకు పాకిస్థాన్‌లో రాజకీయ మద్దతు కూడా లభించింది. ఇది భారత్ నుంచి వస్తున్న ప్రతికూల ప్రచారానికి సమాధానం అని సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్ మెమన్ బహిరంగంగానే ప్రకటించారు. అంతేగాక‌ ఈ ప్రాజెక్టుకు ఆయన మంత్రిత్వ శాఖ కొంతమేర మద్దతు కూడా ఇచ్చింది. సినిమాను వాస్తవికంగా చిత్రీకరించేందుకు 80 శాతం నటీనటులను ల్యారీ స్థానికులనే తీసుకున్నామని దర్శకుడు అబు అలీహా గతంలో తెలిపారు.

భారత చిత్రం ‘ధురంధర్’ పాకిస్థాన్‌లో అధికారికంగా విడుదల కాకపోయినా, పైరసీ ద్వారా అక్కడి ప్రేక్షకులకు చేరింది. అందులో ల్యారీ ప్రాంతాన్ని నెగటివ్‌గా చూపించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ‘మేరా ల్యారీ’ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నప్పటికీ, అవి బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. సానుకూల ప్రచారం, ప్రభుత్వ మద్దతు ఉన్నప్పటికీ ప్రేక్షకులు తిరస్కరించడం గమనార్హం.

Mera Lyari
Pakistan film
Dhurandar
Ayesha Omar
Dananeer Mobeen
Samiya Mumtaz
Abu Aliha
Karachi
Lyari
Pakistani cinema

More Telugu News