ఖండాలు దాటిన ప్రేమ... ఆదిలాబాద్ అబ్బాయిని పెళ్లాడిన లండన్ అమ్మాయి

  • లండన్‌లో పరిచయమై ప్రేమించుకున్న ఆదిలాబాద్ యువకుడు, లండన్ యువతి
  • ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న సాయిచరణ్, మియామే
  • పెద్దల అంగీకారంతో ఆదిలాబాద్‌లో హిందూ సంప్రదాయంలో వివాహం
  • ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిన సాయిచరణ్
ప్రేమకు భాష, ప్రాంతం, దేశం వంటి హద్దులు ఉండవని మరోసారి రుజువైంది. ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు, లండన్‌కు చెందిన యువతి తమ ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంతో పదిలం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన భూశెట్టి సాయిచరణ్‌ పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లారు. చదువు పూర్తయ్యాక అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు లండన్‌లోని కార్డిఫ్‌కు చెందిన మియామేతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో గత ఐదేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు.

తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపి వారిని ఒప్పించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గత నెలలోనే భారత్‌కు వచ్చిన ఈ జంట, నిన్న ఆదిలాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భాష, ప్రాంతాలు వేరైనా ప్రేమతో ఒక్కటైన ఈ నూతన జంటను పలువురు అభినందించారు.

Adilabad
London
Intercultural Marriage
Saicharan
Love Story
Indian Wedding
Mia May
Cross-Border Love
Telangana
NRI

More Telugu News