తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

  • తెలంగాణలో మంగళవారం నుంచి మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం 
  • రాబోయే పది రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
  • మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు
రాష్ట్రంలో రెండు రోజులుగా కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 22 మధ్య కాలంలో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రత ఏకంగా 47 డిగ్రీల మార్కును తాకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

మిగతా ప్రాంతాల్లో 46 డిగ్రీలకు చేరువగా, హైదరాబాద్ నగరంలో సైతం 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరగనుందని, ఈ ప్రభావం కనీసం పది రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని పేర్కొంది. ఆదివారం నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఇదిలా ఉండగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వాన అన్నదాతలను తీవ్రంగా నష్టపరిచింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న రాశులు తడిసిముద్దయ్యాయి. తడిసిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Weather
Telangana heatwave
Hyderabad weather
Heatwave warning
Telangana temperature
India heatwave
Weather forecast Telangana
Gudur rainfall
Nizamabad temperature

More Telugu News