ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ

  • సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం 
  • ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలన్న ప్రధాని
  • ఇంధనాన్ని పొదుపు చేసి, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచన
  • వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించి, అనవసర ప్రయాణాలు తగ్గించాలని సలహా
  • విదేశీ యాత్రలు, బంగారం కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
  • రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సహజ వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపు
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశ ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించడం, అనవసర వస్తువుల కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు మానుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఐక్యంగా పోరాడదాం

అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరి సమష్టి భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. కష్ట సమయాల్లో దేశం కోసం బాధ్యతాయుతంగా జీవించడం, మన కర్తవ్యాలను నెరవేర్చడం కూడా దేశభక్తేనని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడమే కాదు, దేశం కోసం జీవించడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. 

"ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనమందరం కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి" అని మోదీ పిలుపునిచ్చారు.

ఇంధన పొదుపు అత్యవసరం

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, వాటి కొనుగోలుకు వెచ్చిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మనందరి బాధ్యత అని ప్రధాని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న చోట మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వాహనాలు అవసరమైనప్పుడు కార్‌పూలింగ్ విధానాన్ని ఎంచుకోవాలని కోరారు. సరుకు రవాణాకు రైల్వేలను ఎక్కువగా ఉపయోగించాలని, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని సూచించారు.

కొవిడ్ నాటి పద్ధతులు పునరుద్ధరించాలి

దేశ ప్రయోజనాల దృష్ట్యా కరోనా మహమ్మారి సమయంలో పాటించిన కొన్ని పద్ధతులను తిరిగి ప్రారంభించాలని ప్రధాని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వంటి విధానాలకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. "కరోనా సమయంలో మనం ఈ పద్ధతులకు అలవాటు పడ్డాం. ఇప్పుడు వాటిని పునరుద్ధరించడం దేశానికి ఎంతో అవసరం" అని ఆయన అన్నారు.

విదేశీ ప్రయాణాలు, కొనుగోళ్లు వాయిదా

విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడేందుకు ప్రజలు అనవసరమైన విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో విహారయాత్రలు, పెళ్లిళ్లు వంటివి మానుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, వేడుకలను భారతదేశంలోనే జరుపుకోవాలని కోరారు. అలాగే, కనీసం ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను నివారించాలని సలహా ఇచ్చారు. 

"మేడ్-ఇన్-ఇండియా" ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా బూట్లు, బ్యాగులు వంటి రోజువారీ వస్తువులను స్థానికంగా తయారైనవే కొనాలని సూచించారు.

రైతులకు, కుటుంబాలకు సూచనలు

ప్రతి కుటుంబం వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ప్రధాని హితవు పలికారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించాలని, సహజ వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లాలని కోరారు. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని వివరించారు. డీజిల్ పంపులకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ఎక్కువగా వినియోగించుకోవాలని ఆయన రైతులను ప్రోత్సహించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల బస్తా ధర సుమారు రూ. 3,000 ఉండగా, భారత ప్రభుత్వం రైతులకు కేవలం రూ. 300 లోపే అందిస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా తనపై వేసుకుంటోందని, అయితే సంక్షోభం తీవ్రంగా ఉన్నందున ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. "భారతమాతను ప్రథమ స్థానంలో నిలిపి, మనమందరం ఐక్యంగా పోరాడాలి" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


Narendra Modi
India economy
economic crisis
gold purchase
fuel conservation
work from home
foreign exchange
Indian economy
public transport
made in india

More Telugu News