ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర.. ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత!

  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
  • మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయ‌ర్‌
  • పంజాబ్, లక్నో తర్వాత ఢిల్లీ తరఫున ఈ మైలురాయి
  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన రాహుల్
  • ఢిల్లీ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా మ‌రో రికార్డు
భారత స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి, ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న‌ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేసిన రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 1000 పరుగుల మైలురాయిని దాటాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి, ఢిల్లీ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో జేపీ డుమినీ, రిషభ్ పంత్ (35 ఇన్నింగ్స్‌లు చొప్పున) పేరిట ఉన్న రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లలో 468 పరుగులతో రాహుల్ ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

ఢిల్లీ కంటే ముందు రాహుల్ పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తరఫున కూడా వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. పంజాబ్ తరఫున 55 మ్యాచ్‌ల్లో 2,548 పరుగులతో ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక, లక్నో తరఫున 38 మ్యాచ్‌ల్లో 1,410 పరుగులు చేశాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించినా, ఆ జట్ల తరఫున వెయ్యి పరుగుల మార్కును అందుకోలేకపోయాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (47 బంతుల్లో 100 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో ఢిల్లీ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

KL Rahul
IPL
Delhi Capitals
Kolkata Knight Riders
Lucknow Super Giants
Punjab Kings
Finn Allen
Cricket
IPL Records
T20 Cricket

More Telugu News