రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్

  • విజయ్‌కు మద్దతుగా గవర్నర్‌కు లేఖను అందజేసినట్లు వెల్లడి
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కి గవర్నర్ సూచించారని వెల్లడి
  • బయటి నుంచే మద్దతిస్తామన్న వామపక్షాలు
టీవీకే అధ్యక్షుడు విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఐ(ఎం) నాయకుడు కే.బాలకృష్ణన్ తెలిపారు. ప్రమాణ స్వీకారం కోసం ఆహ్వానాలు పంపించడం జరుగుతుందని అన్నారు. టీవీకే అధినేత విజయ్‌కి మద్దతిస్తూ తాము గవర్నర్‌కు లేఖను అందజేశామని తెలిపారు.

విజయ్ గవర్నర్‌ను కలిశారని, తగినంత బలం ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ సూచించినట్లు చెప్పారు. తాము ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు గాను విజయ్ అక్కడి నుంచి నేరుగా తమ కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలియజేశారని చెప్పారు.

టీవీకే పార్టీకి మొదట ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు పలికింది. ఈరోజు సీపీఐ, సీపీఎం, వీసీకే కూడా మద్దతు తెలపడంతో విజయ్ సారథ్యంలో ప్రభుత్వం కొలువుతీరేందుకు అంతా సిద్ధమైంది.

బయటి నుంచే మద్దతు

టీవీకేకు తాము బయటి నుంచి మద్దతిస్తామని, ప్రభుత్వంలో చేరబోమని సీపీఎం నేత యు.వాసుకి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు ఈరోజు సమావేశమయ్యాయని, టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో కచ్చితంగా టీవీకేకు మద్దతుగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. తాము మంత్రివర్గంలో మాత్రం చేరబోమని తెలిపారు.

వామపక్షాలు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని వీసీకే కూడా చెప్పిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు టీవీకేకు అధిక మెజారిటీ ఇచ్చారని, అందుకే వారికి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజాసమస్యల ఆధారంగా తాము స్వతంత్రంగా వ్యవహరించి పని చేస్తామని హామీ ఇచ్చారు. మాతో కలిసి వచ్చే ఏ లౌకికవాద పార్టీతో అయినా మేం కలిసి నడిచేందుకు సిద్ధమని అన్నారు.

కాగా, విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని తెలుస్తోంది.

Vijay
TVK Party
Tamil Nadu Politics
Chief Minister
Balakrishnan
Rahul Gandhi
Mallikarjun Kharge

More Telugu News