గవర్నర్ ను కలిసిన విజయ్... రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం!

Vijay to be sworn in as Tamil Nadu CM tomorrow at 11 AM
  • తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ
  • గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ క్లెయిమ్
  • రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విజయ్
  • 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వెల్లడి
  • మద్దతిచ్చిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్
తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైంది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో రేపు ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సాయంత్రం విజయ్ లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని గవర్నర్‌కు ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ఆయా పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించేందుకు గవర్నర్ సమ్మతి తెలిపారు.

అంతకుముందు విజయ్ చేసిన విజ్ఞప్తులను, తగిన సంఖ్యాబలం లేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. విజయ్‌ను అధికారానికి దూరం చేసేందుకు, దశాబ్దాల వైరం మరచి డీఎంకే, అన్నాడీఎంకే ఏకమవుతాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాజా పరిణామాలతో ఆ ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం మద్దతుతో విజయ్ టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం విజయ్, తమకు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లి వామపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడడంతో టీవీకే నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారంటూ వార్తలు వచ్చాయి. అయితే టీవీకే వర్గాలు ఆ వార్తలను ఖండించాయి. తాము సుప్రీంకోర్టుకు వెళ్లామనడంలో నిజంలేదని స్పష్టం చేశాయి. 
Go Back to Shorts
Vijay
Tamil Nadu politics
Tamilaga Vettri Kazhagam
TVK
Rajendra Arlekar
Tamil Nadu Chief Minister
DMK
AIADMK
Tamil Nadu Governor
Indian politics

More Telugu News