టీవీకే విజయం వెనుక జగన్ ఫొటో ఉందనే ప్రచారంపై సత్యకుమార్ విమర్శలు
- విజయ్‌ని గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న సత్యకుమార్
- జగన్ పాలనను ఏపీ ప్రజలే తిరస్కరించారని ఎద్దేవా
- రోజా ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓటమి తప్పదని వ్యాఖ్య
తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ వ్యవస్థపై స్పందించారు.
తమిళనాడులో టీవీకే అధినేత విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే విషయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుసరిస్తున్న తీరుపై వస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. గవర్నర్ విజయ్‌ని ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆయన పూర్తిగా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారని ఆయన పునరుద్ఘాటించారు.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయం వెనుక జగన్ ఫొటో ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని మంత్రి హాస్యాస్పదంగా అభివర్ణించారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలే జగన్ పాలనను తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేశారని, అలాంటిది పొరుగు రాష్ట్రంలో ఆయన ప్రభావం ఉంటుందనుకోవడం భ్రమ అని ఎద్దేవా చేశారు. "బోర్డర్ దాటితే జగన్‌ను ఎవరైనా గుర్తుపడతారా?" అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు ఎన్నికల్లో మాజీ మంత్రి రోజా డీఎంకే తరఫున ప్రచారం చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓటమి ఖాయమని, డీఎంకే పరాజయం పాలవ్వడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. ఏపీలో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు ఇంకా తమ తీరు మార్చుకోలేదని ఆయన మండిపడ్డారు.