హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య

Sunanda Retired IPS Officer Wife Murdered in Hyderabad
  • వినయ్ రంజన్ రే భార్య సునంద దారుణ హత్య
  • పనిమనిషి కల్పన, ఆమె గ్యాంగ్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు
  • అర్ధరాత్రి రెండు గంటలకు హత్య జరిగిందన్న సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునంద (55) దారుణ హత్యకు గురయ్యారు. బంగారం, డబ్బుల కోసం పనిమనిషి కల్పన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కల్పనతో పాటు ఆమె గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. రిటైర్డ్ అధికారి నివాసంలో కల్పన పనిమనిషిగా చేరింది. పక్కా ప్లాన్‌తో ఏడెనిమిది నెలల పాటు కల్పన, ఆమె గ్యాంగ్ ఎదురుచూసినట్లు తెలుస్తోంది.

ఇంటి ముందు నుంచి వస్తే సీసీటీవీ ఫుటేజీకి చిక్కుతామని భావించి, వెనుక నుంచి వచ్చి ఈ హత్యకు పాల్పడ్డారు. కల్పనతో సహా మొత్తం ముగ్గురు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పారిపోయే క్రమంలో ఒక నిందితుడి క్యాప్ కిందపడటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. సునంద భర్త వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు.

సునంద ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన కల్పన, ఈ విషయాన్ని తన గ్యాంగుకు చేరవేసి వారిని రప్పించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. కల్పన నేపాల్‌కు చెందిన మహిళ. డబ్బులు, బంగారం చోరీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హత్య జరిగిందని తెలిపారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. కొన్ని ఆధారాలు సేకరించామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని సజ్జనార్ అన్నారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారని వెల్లడించారు. బంగారం, నగలు ఎత్తుకుపోయారా లేదా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. వెనుక గేటు నుంచి వచ్చి హత్య చేసినట్లు చెప్పారు. కాగా, ఘటనా స్థలాన్ని డీజీపీ  సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్ పరిశీలించారు.
Go Back to Shorts
Sunanda
Hyderabad
IPS Officer
Murder
Jubilee Hills
Prashasan Nagar
Kalpana
Nepal Gang
CV Anand
Sajjanar

More Telugu News