బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. ఎల్లుండి కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం!

  • పశ్చిమ బెంగాల్ శాసనసభను రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి
  • ముగిసిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పదవీకాలం
  • ఎన్నికల తర్వాత రాజీనామాకు నిరాకరించడంతో ఏర్పడిన సంక్షోభం
  • ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని మమత ఆరోపణ
  • ఎల్లుండి కొలువుదీరనున్న కొత్త బీజేపీ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (మే 7) అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది.
"భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను" అని గవర్నర్ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలను అంగీకరించని మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు, ఈ పరిణామంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలిచిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీతో కుమ్మక్కై తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. బీజేపీ విజయాన్ని "అనైతికం" అని ఆమె అభివర్ణించారు.

గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎల్లుండి బీజేపీ నేతృత్వంలో నూతన ప్రభుత్వం కొలువుదీరనున్నట్టు సమాచారం.

Mamata Banerjee
West Bengal
West Bengal Assembly
Governor RN Ravi
BJP
West Bengal Elections
EVM tampering
Political Crisis
Government Formation
Assembly dissolved

More Telugu News