కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. స్పందించిన బండి సంజయ్

  • బీఆర్ఎస్ నాయకులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం
  • తమ కార్యకర్తల సహనం పరీక్షించవద్దన్న బండి సంజయ్
  • దాడులు, దౌర్జన్యాలు తమ సంస్కృతి కాదన్న బండి సంజయ్
కరీంనగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారని, తమ కార్యకర్తలకు కూడా సహనం ఉంటుందని, కానీ ఆ సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని అన్నారు. దాడులు చేయడం, దౌర్జన్యాలకు దిగడం తమ సంస్కృతి కాదని అన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు తమ సహనాన్ని పరీక్షించవద్దని బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల నీతి వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. పదేళ్లలో ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజలు మరిచిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలన రజాకార్లను తలపించిందని ఆరోపించారు. దాడుల సంస్కృతిని ఆ పార్టీయే ఆరంభించిందని విమర్శించారు. గతంలో తాను చేపట్టిన ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయని అన్నారు. నాడు పదుల సంఖ్యలో కార్లను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేశారని ధ్వజమెత్తారు. గతంలో చేసిన దాడులను మరిచిపోయి ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay
Karimnagar
BRS leaders
MLA camp office attack
Telangana politics
Rajaakar
Praja Sangrama Yatra

More Telugu News