బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Sets AP Development Goals at Collectors Meeting
  • సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టే (W-D-WC) ప్రభుత్వ విధానమని ప్రకటించిన సీఎం
  • రాష్ట్ర అభివృద్ధిలో దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం
  • ఫైళ్లు కదలడం కాదు, ఫలితాలు కదలాలంటూ పాలనలో వేగంపై స్పష్టత
  • గత ప్రభుత్వం నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి
  • రూ.23 లక్షల కోట్ల ఒప్పందాలతో ఏపీకి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు
సంక్షేమం (Welfare), అభివృద్ధి (Development), సంపద సృష్టి (Wealth Creation).. ఈ మూడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఈ W-D-WC సైకిల్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారానే రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పాలనలో వేగం పెంచి, అభివృద్ధిలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల 7వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి స్పష్టమైన మార్గసూచీని ఆవిష్కరించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, "గత పాలకుల నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు, రూ.1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు మనకు వారసత్వంగా సంక్రమించాయి. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. వారి నిర్వాకం వల్ల రాష్ట్రం గుంతలమయమైన రోడ్లతో విధ్వంసమైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి అందరి సహకారంతో గట్టెక్కి, వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టగలిగాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

అభివృద్ధి, సంపదతోనే సంక్షేమం
డబ్బులు లేవని చెప్పడం కాదని, వినూత్నంగా ఆలోచించి సంపద సృష్టించడంపై దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. "వెల్ఫేర్, డెవలప్‌మెంట్, వెల్త్ క్రియేషన్ (W-D-WC) అనేది ఒక సైకిల్ లాంటిది. అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు భద్రత, భరోసా కల్పించాం. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి (P4) ద్వారా ఆర్థిక ప్రమాణాలు పెంచుతున్నాం" అని ఆయన తెలిపారు. 26 కొత్త పారిశ్రామిక విధానాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీపై నమ్మకాన్ని కల్పించామని అన్నారు.

"కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడపడం ఒక గర్వకారణంగా భావించేవాళ్లం. ఇప్పుడు అదే సంస్థను ఏపీకి తీసుకురాగలిగాం. రాష్ట్రంలో రోజుకో ఒప్పందం, వారానికో శంకుస్థాపన చేసుకునే స్థాయికి చేరుకున్నాం. ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ కంపెనీలు ఏపీకి వచ్చాయి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.

ఫైళ్లు కాదు.. ఫలితాలు కదలాలి
పాలనలో వేగం, జవాబుదారీతనం అత్యంత కీలకమని సీఎం ఉద్ఘాటించారు. "స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది కేవలం నినాదానికే పరిమితం కారాదు. 'ఫైల్స్ షుడ్ నాట్ మూవ్... రిజల్ట్స్ షుడ్ మూవ్' (ఫైళ్లు కాదు, ఫలితాలు కదలాలి) అనేదే మన విధానం కావాలి. ప్రజల నుంచి వచ్చిన ఆర్థికేతర ఫిర్యాదులను 100 శాతం పరిష్కరించాల్సిందే" అని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

"ఆఫీస్ చెప్పేది డేటా మాత్రమే, క్షేత్రస్థాయికి వెళ్తేనే అసలు నిజం తెలుస్తుంది (ఆఫీస్ టెల్స్ యూ డేటా... ఫీల్డ్ టెల్స్ యూ ట్రూత్). అందుకే కార్యదర్శులు 3 రోజులు, విభాగాధిపతులు 6 రోజులు, కలెక్టర్లు 8 రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి" అని ఆయన స్పష్టం చేశారు. 

జిల్లాల మధ్య అభివృద్ధిలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఒక జిల్లాలో అమలు చేసిన ఉత్తమ పద్ధతులను మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని, ఆయా కలెక్టర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో, పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యమని గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh development
AP collector conference
Welfare development wealth creation
AP industrial progress
Green energy Andhra Pradesh
AP government schemes
AP economy
Job creation Andhra Pradesh
AP investments

More Telugu News