రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao Slams Revanth Reddy Over Farmer Issues
  • వడ్ల కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన
  • నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని విమర్శ
  • తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ
వడ్ల కుప్పల వద్ద రైతుల గుండెల ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితిని తెలంగాణలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని విమర్శించారు.

తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు.

నేను వారిలా ఏసీ గదిలో కూర్చుని మాట్లాడటం లేదని విమర్శించారు. రైతుల మధ్య నిల్చుని, వారి గోడు విని మాట్లాడుతున్నానని అన్నారు. కల్లాలలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తేమ పరీక్షకు పదిరోజులు, గోనె సంచులకు వారం రోజులు, కాంటా (తూకం) పెట్టడానికి మరో వారం రోజులు పడుతుందని ఆరోపించారు. మిల్లులకు వెళ్లిన తర్వాత కూడా లారీకి నాలుగైదు బస్తాల వరకు కటింగ్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని హరీశ్ రావు అన్నారు. చౌటుప్పల్ మార్కెట్‌లో వర్షం పడితే కనుక వడ్ల కుప్పలు నీట మునిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, యూరియా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తరుగు పెడితే తోలు తీస్తామని గతంలో సీఎం చెప్పారని, ఇప్పుడు బస్తాకు రెండు మూడు కిలోల తరుగు తీస్తుంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
Advertisement
Harish Rao
Revanth Reddy
Telangana
Paddy Procurement
Farmers Issues
Choutuppal
Yadadri Bhuvanagiri

More Telugu News