గంగుల కమలాకర్ కార్యాలయం వద్ద దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం!
- బండి సంజయ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగిన కౌశిక్ రెడ్డి
- డ్రగ్స్ తీసుకోవడం వల్ల సంజయ్ కు బట్టతల వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు
- కౌశిక్ కారు అద్దాలను ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు
కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా సెగలు పుట్టిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసు వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో బండి సంజయ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బండి సంజయ్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే ఆయనకు బట్టతల వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, డ్రగ్స్ టెస్టుకు తాము సిద్ధమని, బండి సంజయ్ కూడా రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల ఖర్చు కోసం గతంలో భార్య పుస్తెలు అమ్మినట్లు చెప్పిన సంజయ్, ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కౌశిక్ రెడ్డి లోపల ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే, బయట ఉన్న ఆయన కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారు. బండి సంజయ్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. క్యాంప్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ శ్రేణులను అడ్డుకోవడానికి లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి నిఘాను పెంచారు. గంగుల ఆఫీసు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.