సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu Directs Collectors on Wealth Creation for Welfare
  • ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్
  • గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం
  • సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు
  • ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశం
  • రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వెల్లడి
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు.

గత పాలనలో రాష్ట్రం విధ్వంసం.. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతోపన్యాసం చేస్తూ, రాష్ట్ర పరిపాలనపై తన దార్శనికతను, ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. "గత పాలకుల నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మనకు సంక్రమించాయి. అంతేకాకుండా, 94 కేంద్ర పథకాల నుంచి సుమారు రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించింది. చెల్లించాల్సిన బిల్లులు రూ.1.30 లక్షల కోట్లు కూడా మనపైనే రుద్దారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలు పడి విధ్వంసమయ్యాయి" అని చంద్రబాబు వివరించారు.

సంపద సృష్టితోనే సంక్షేమం.. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి
ప్రస్తుతం తమ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. "సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివి. అభివృద్ధి లేకుండా సంపద రాదు, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదు. డబ్బులు లేవని కూర్చోవడం కాదు, సంపదను సృష్టించే పని చేయాలి, చేద్దాం" అని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వం విజయవంతమవుతుందని స్పష్టం చేశారు.

జవాబుదారీతనం అత్యంత ముఖ్యం
పరిపాలనలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు. "ప్రజల నుంచి వచ్చే ఆర్థికేతర ఫిర్యాదులను 100 శాతం పరిష్కరించాల్సిందే. కొందరు అధికారులు వాటిని పైకి కిందకు తిప్పుతున్నారు, ఈ వైఖరి మారాలి. ఆర్థికపరమైన ఫిర్యాదులపైనా విచారణ జరిపి, అర్హమైన వాటిని వెంటనే పరిష్కరించాలి. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలి" అని అధికారులకు గడువు విధించారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని సీఎం వివరించారు. "నా కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేయడం గర్వంగా భావించేవాళ్లం. అలాంటి దిగ్గజ సంస్థను ఇప్పుడు ఏపీకి తీసుకువచ్చాం. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి. రూ.23 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఇవి సాకారమైతే 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి" అని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు డేటా, ఏఐ, క్వాంటం టెక్నాలజీలకు ఏపీ కేంద్రంగా మారనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, విద్య-వైద్యం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో సమీక్షించనున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Collectors Conference
State Finances
Debt
Welfare Schemes
Economic Development
Investments
Governance
AP Vision 2047

More Telugu News