కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్

  • బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విభాగాలుగా విభజించారన్న సీతక్క
  • రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ
  • బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వ్యాఖ్య

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని ఆమె అన్నారు.

కేటీఆర్ తన అహంకారపూరిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీని నాలుగు విడతలుగా విభజించి రైతులను ఇబ్బంది పెట్టారని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చిందని తెలిపారు.

గత ప్రభుత్వం పంట బోనస్ హామీని తుంగలో తొక్కితే, తమ ప్రభుత్వం పంటలకు బోనస్ ఇస్తోందని పేర్కొన్నారు. రైతు బంధు నిధుల విడుదల విషయంలో గతంలో తీవ్ర జాప్యం జరిగేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.

తాము ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నామని, ఫామ్ హౌస్‌లకో లేక ఫారిన్ టూర్లకో పరిమితం కాలేదని కేటీఆర్‌కు చురకలంటించారు. గత ప్రభుత్వంలో జరిగిన కమీషన్ల దందాల గురించి అందరికీ తెలుసని, అటువంటి వారు ఇప్పుడు కమీషన్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్‌ను సీతక్క హెచ్చరించారు.

Seethakka
KTR
Revanth Reddy
Rahul Gandhi
Telangana Congress
BRS
Farmer welfare
Crop bonus
Rythu Bandhu
Telangana politics

More Telugu News