నటుడు విజయ్‌కు ఊహించని మద్దతు.. చక్రం తిప్పుతున్న అన్నాడీఎంకే!

  • మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిన టీవీకే
  • టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇచ్చే ఆలోచనలో అన్నాడీఎంకే 
  • చెన్నైలో సమావేశం కానున్న పార్టీ ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. అతిపెద్ద పార్టీగా అవతరించినందున, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ టీవీకేను ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక విజయ్ సభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. విజయ్ రెండుచోట్ల గెలిచినందున, ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. దీంతో టీవీకే బలం 107కు తగ్గుతుంది. ఈ లెక్కన మెజారిటీ నిరూపించుకోవాలంటే కనీసం 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు తప్పనిసరి.

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీవీకేకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లోని పార్టీలతో తెరవెనుక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ (5 సీట్లు), అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే (4 సీట్లు) విజయ్‌కు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ విజయ్‌కు ఫోన్ చేసి అభినందించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ఒకవేళ చిన్న పార్టీలపై ఆధారపడకుండా అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇస్తే, విజయ్ ప్రభుత్వం మరింత పటిష్ఠంగా ఉంటుంది. మంత్రి పదవులు వంటి అంశాల్లో చిన్న పార్టీల నుంచి ఒత్తిళ్లు లేకుండా, పాలనపై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం విజయ్‌కు లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే సమావేశంలో తీసుకోబోయే నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది.

Vijay
Tamil Nadu politics
TVK
Tamilaga Vetri Kazhagam
AIADMK support
Tamil Nadu assembly elections
DMK coalition
Rajendra Vishwanath Arlekar
Tamil Nadu government formation
Rahul Gandhi

More Telugu News