కేరళలో రోడ్డు ప్రమాదం.. నటుడు సంతోష్ నాయర్ కన్నుమూత

  • ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి
  • 100కు పైగా చిత్రాల్లో నటించిన సంతోష్
  • చివరి చిత్రం 'మోహినియాట్టం'
  •   ప్రమాదంలో ఆయన భార్యకు తీవ్ర గాయాలు
ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ నాయర్ (63) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా ఏనాతు వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈ ప్రమాదంలో సంతోష్ నాయర్ భార్య శుభశ్రీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ సైతం గాయపడినట్లు సమాచారం. 1960 నవంబర్ 12న తిరువనంతపురంలో సంతోష్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కాగా, సంతోష్ నటన వైపు ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

1982లో 'ఇతు జంగలుడే కథ' చిత్రంతో వెండితెరపై అరంగేట్రం చేసిన సంతోష్ నాయర్, నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో మలయాళ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న 'మోహినియాట్టం' ఆయన నటించిన చివరి చిత్రం కావడం విచారకరం. సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సంతోష్ నాయర్ మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది.

Santhosh Nair
Malayalam actor
road accident
Kerala accident
Mohiniyattam movie
Saiju Kurup
Malayalam cinema
film industry
death
obituary

More Telugu News