ఎవరీ అను శర్మ..? ట్రెండింగ్ లో ఉన్న ఇండియన్ టెక్కీ

  • గూగుల్ ఉద్యోగాన్ని వదిలి ప్యాలంటీర్ టెక్నాలజీస్‌లో చేరిన అను శర్మ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భారతీయ సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్
  • ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్ల నుంచి భారీ స్పందన
  • ఇన్‌స్టా, లింక్డ్‌‌ఇన్‌లో అను శర్మకు లక్షల్లో ఫాలోవర్లు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగాన్ని వదిలి, మరో కంపెనీలో చేరిన ఓ భారతీయ సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. అను శర్మ అనే ఈ టెక్కీ తీసుకున్న కెరీర్ నిర్ణయంపై టెక్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్‌లో బీటెక్ పూర్తి చేసిన అను శర్మ, తన కెరీర్ ఆరంభంలోనే ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, ఇంట్యూట్ వంటి సంస్థల్లో ఇంటర్న్‌ షిప్‌లు చేశారు. 2024లో హైదరాబాద్‌లోని గూగుల్‌లో పూర్తిస్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరారు. దాదాపు సంవత్సరం ఏడు నెలల పాటు అక్కడ పనిచేసిన తర్వాత, ఇటీవల డేటా అనలిటిక్స్ సంస్థ అయిన ప్యాలంటీర్ టెక్నాలజీస్‌లో 'ఫార్వర్డ్ డిప్లాయ్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌'గా కొత్త బాధ్యతలు చేపట్టారు.

గూగుల్ వంటి పెద్ద కంపెనీలో ఉద్యోగాన్ని చాలామంది కెరీర్‌లో అంతిమ లక్ష్యంగా భావిస్తారు. అలాంటిది అను శర్మ గూగుల్‌ను వీడి ప్యాలంటీర్‌కు మారడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సౌకర్యవంతమైన ఉద్యోగం కంటే ఉన్నత స్థాయి, ప్రభావవంతమైన పాత్రను ఎంచుకున్నారంటూ ఆమె నిర్ణయంపై చర్చ మొదలైంది.

ఈ విషయం తెలియగానే నెటిజన్లు ఆమె ప్రొఫైల్‌పై ఆసక్తి చూపించారు. లింక్డ్‌ఇన్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగిన అను శర్మ కెరీర్ నిర్ణయాన్ని చాలామంది ప్రశంసించారు. "ఇలాంటివే తెలివైన కెరీర్ నిర్ణయాలు", "ఆమె నిజమైన లీడర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. టెక్ రంగంలో కెరీర్ ఎదుగుదలకు ఆమె ఒక స్ఫూర్తి అని కొనియాడుతున్నారు.
 

Anu Sharma
Indian techie
Google
Palantir Technologies
software engineer
career change
data analytics
Hyderabad
trending

More Telugu News