బెంగాల్‌లో విజయం సాధించాం.. తదుపరి లక్ష్యం తెలంగాణ: రాష్ట్ర బీజేపీ ధీమా

  • తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా
  • రాష్ట్ర పురోగతి డబుల్ ఇంజిన్ సర్కార్‌తో సాధ్యమని వ్యాఖ్య
  • కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతున్నారన్న బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించామని, అసోంను తిరిగి నిలబెట్టుకున్నామని, ఇక తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లటంతో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా ఎగురుతుందని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటోందని, ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ విజయం  ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోగతి కోరుకుంటున్న ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమని భావిస్తున్నారని అన్నారు.

బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని, తమ పార్టీని ఆదరించినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తదుపరి ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు. దేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, ఆ రాష్ట్ర ప్రజలు తిరిగి తమనే గెలిపిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన, అవినీతిరహిత, అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలను ప్రజలు ఓడించారని అన్నారు. తమిళనాడులో డీఎంకే కూటమికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం పేరిట రాజకీయాలు చేసే వారికి ప్రజలు సరైన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉన్నారని తాజా ఫలితాలను బట్టి తెలుస్తోందని తెలిపారు.

మే 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఉందని రామచందర్ రావు గుర్తు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు రెండు లక్షలమంది హాజరవుతారని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Telangana BJP
BJP
Telangana
Bengal
Ramachander Rao
Narendra Modi
BRS
Congress
Telangana Elections

More Telugu News