కేరళలో కాంగ్రెస్ గెలుపు.. తాను చేసిన ప్రచారాన్ని గుర్తుచేసుకుంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

  • తన ప్రచారం సందర్భంగా ప్రజలు ఎంతో అభిమానం చూపించారన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణ, కేరళలు ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన రాష్ట్రాలని వ్యాఖ్య
  • కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుకు నాంది పలికారన్న సీఎం
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు. తాను కేరళలో ప్రచారం చేసిన ఫొటోలను కూడా పంచుకున్నారు. కేరళలో యూడీఎఫ్ కూటమి అసాధారణ, స్ఫూర్తిదాయకమైన విజయం సాధించిందని పేర్కొన్నారు. ఇందుకు కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారకులు అంటూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, దీపాదాస్ మున్షీలకు కూడా అభినందనలు తెలిపారు.

తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతోమంది యూడీఎఫ్ మద్దతుదారులు, కేరళ ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని గుర్తు చేసుకుని రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో ప్రగతిశీల విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిని విశ్వసిస్తాయని పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా దశాబ్ద కాలం పాటు అన్యాయాన్ని ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తుకు నాంది పలికాయని అన్నారు.

కేరళలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రగతిశీల పాలన, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. యూడీఎఫ్‌ను కేరళ ప్రజలు ఆదరించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ అన్నారు. ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.

Revanth Reddy
Kerala
Congress
UDF
Rahul Gandhi
Mallikarjun Kharge
Priyanka Gandhi
Kerala Assembly Elections

More Telugu News