అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఇది: శ్రీనివాస వర్మ

  • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్న శ్రీనివాస వర్మ
  • అసోం, పుదుచ్చేరిల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి
  • కేరళ అసెంబ్లీలో మూడు సీట్లతో అడుగు పెడుతున్నామని వెల్లడి

పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఫలితాల్లో బీజేపీ సాధిస్తున్న విజయాలపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆనందం వ్యక్తం చేశారు. జనసంఘ్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాడిన గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై స్పందించారు. బీజేపీ ప్రభంజనంపై విజయవాడలో జరిగిన సంబరాల్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని, ఇది అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన గట్టి సమాధానమని అభివర్ణించారు. 


2011లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని స్థితి నుంచి నేడు దాదాపు రెండు వందల స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన దాడులు, అక్రమ వలసదారుల ప్రోత్సాహం వంటి కుట్రలను బెంగాల్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన మండిపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏ గడ్డ మీదైతే 'ఒకే చట్టం - ఒకే జెండా' కోసం పోరాడారో, అదే గడ్డపై పార్టీ ఆవిర్భావ దినోత్సవ సమయంలో బీజేపీ జెండా రెపరెపలాడటం గర్వకారణమని పేర్కొన్నారు.


అసోం, పుదుచ్చేరిల్లో  అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు, కేరళ అసెంబ్లీలోకి ఎన్డీయే కూటమి 3 స్థానాలతో అడుగు పెట్టబోతోందని మంత్రి వెల్లడించారు. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పరాజయం పాలవ్వడం, మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పడం వంటివి దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతాలని విశ్లేషించారు. ప్రధాని మోదీ, అమిత్ షా గారి నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయాలకు వెన్నెముక అని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.


Srinivasa Varma
BJP victory
West Bengal election
Assam election
Puducherry election
Mamata Banerjee
Shyam Prasad Mukherjee
Assembly elections 2024
Bhupathiraju Srinivasa Varma
Tamil Nadu DMK

More Telugu News