కవిత పార్టీపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కవితతో పార్టీ ఎవరు పెట్టించారో అందరికీ తెలుసన్న కేఏ పాల్
  • అందుకే ఆ పార్టీలో మాజీలు చేరడం లేదని వ్యాఖ్య
  • కవిత సీఎం పదవి అడిగితే తండ్రి నిరాకరించారన్న పాల్
  • యుద్ధం ఆపేందుకు ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానన్న కేఏ పాల్
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కవిత ఏర్పాటు చేసిన పార్టీపై స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆమెతో పార్టీని ఎవరు పెట్టించారో అందరికీ తెలుసని, అందుకే మాజీ ప్రజాప్రతినిధులు ఎవరూ ఆ పార్టీలో చేరడం లేదని అన్నారు. అవినీతి, కుటుంబ, కుల పార్టీలను ఎవరూ నమ్మవద్దని కోరారు.

ఆమె స్థాపించిన పార్టీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని విమర్శించారు. కేవలం తండ్రితో ఉన్న గొడవ కారణంగానే ఆమె పార్టీని ఏర్పాటు చేశారు తప్ప మరో కారణం లేదని అన్నారు. తాను అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నానని, అందువల్లే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని పేర్కొన్నారు. గతంలో కవిత తన తండ్రిని ముఖ్యమంత్రి పదవి అడిగారని, అందుకు కేసీఆర్ నిరాకరించారని పేర్కొన్నారు.

2008లోనే కవిత తన వద్దకు వచ్చి పార్టీ కోసం రూ.10 కోట్లు ఇవ్వాలని అడిగారని, తాను రూ.15 కోట్లు ఇవ్వాలనుకున్నానని చెప్పారు. కానీ కవితకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని కేసీఆర్ కోరడంతో ఆగిపోయానని చెప్పారు. తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే కవిత పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుల విషయంలో షర్మిలకు ఎలాగైతే అన్నతో విబేధాలు వచ్చాయో, కవితకు తన కుటుంబంతో అలాగే వచ్చాయని అన్నారు.

అమెరికా, ఇరాన్ యుద్ధంపై..

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు తాను డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపే పనిలో ఉన్నానని అన్నారు. ఈ యుద్ధం ఆగకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 850 కోట్ల మంది తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌తో పాటు ఎందరో దేశాధినేతలు తన సలహాలు, సూచనలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాను అప్పులు తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయగలనని చెప్పారు.

KA Paul
Kalvakuntla Kavitha
Telangana
BRS Party
America Iran War
KCR
Telangana Politics

More Telugu News