అమ్మలా పరిణితి చెందుతానంటే ఎగతాళి చేశారు: కవిత
- రాష్ట్రంలో అన్ని వర్గాల రక్షణే తమ పార్టీ ధ్యేయమన్న కవిత
- తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచిత విద్యను అందిస్తామని హామీ
- ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందిస్తామన్న కవిత
తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)ను ఆవిష్కరిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన 'మీట్ ది ప్రెస్'లో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలకు 'అమ్మలా' ఆలోచించే హృదయం లేదని కవిత విమర్శించారు. "నేను అమ్మలా పరిణితి చెందుతానని అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ అమ్మలా లాలించి పాలన చేసినప్పుడే ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుంది" అని ఆమె స్పష్టం చేశారు.
సామాన్యుడి ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యానికే ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన కవిత, తమ పార్టీ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తామని, దీనికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక తమ వద్ద సిద్ధంగా ఉందని వెల్లడించారు.
తమ ప్రభుత్వం వస్తే... క్యాన్సర్ వంటి మహమ్మారి సోకితే నిరుపేదలు ప్రాణాలు వదులుకోవాల్సిన అవసరం లేదని, ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరించి ప్రతి బిడ్డకు నాణ్యమైన వైద్యం అందిస్తుందని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు విడుస్తుండటం తనను కలచివేసిందని కవిత అన్నారు. ధాన్యం ఎగుమతి కోసం ప్రత్యేక కమిటీ వేసి రైతులకు మద్దతు ధరతో పాటు ఆత్మగౌరవం కల్పిస్తామన్నారు.
యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. 18-45 ఏళ్ల యువతకు వారి ఐడియాలజీ ఆధారంగా రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు. సచివాలయం వంటి భారీ కట్టడాల్లో వికలాంగుల కోసం కనీసం ర్యాంప్‌లు, ప్రత్యేక టాయిలెట్లు లేకపోవడం దారుణమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.