ఆమెలో నాకు ధోనీ కనిపిస్తున్నాడు: దినేష్ కార్తీక్

Smriti Mandhana Reminds Me of Dhoni in Captaincy Says Dinesh Karthik
  • స్మృతి మంధన కెప్టెన్సీని ధోనీ సారథ్యంతో పోల్చిన దినేష్ కార్తీక్
  • ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే, స్పష్టమైన నాయకత్వం అందిస్తుందని ప్రశంస
  • మంధన సారథ్యంలో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం
  • టోర్నీలో అత్యధిక పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి
  • గతేడాది ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధనపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె నాయకత్వ పటిమ, ప్రశాంతతను చూస్తుంటే తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గుర్తుకొస్తున్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్‌సీబీ విడుదల చేసిన ఓ వీడియోలో కార్తీక్ మాట్లాడుతూ.. మంధన తనకు ఇష్టమైన క్రీడాకారిణులలో ఒకరని తెలిపారు. ఆమె తనను తాను ప్రెజెంట్ చేసుకునే విధానం, నిర్ణయాల్లో స్పష్టత అద్భుతంగా ఉంటాయన్నాడు. "ఆట పరిస్థితులను అంచనా వేయడంలో ఆమెకు సహజంగానే మంచి పట్టుంది. జట్టు సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. అదే సమయంలో, ఎవరికైనా సందేహం వస్తే అండగా నిలుస్తుంది" అని కార్తీక్ వివరించాడు. సరిగ్గా ఇలాంటి లక్షణాలే గతంలో ధోనీలో చూశామని, అందుకే ఆమె తన నాయకత్వ పరంగా ధోనీని గుర్తుచేస్తుందని పేర్కొన్నాడు.

స్మృతి మంధన కెప్టెన్సీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మంధన నిలిచింది. ఫైనల్‌లో డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీకి విజయాన్ని అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

అంతేకాకుండా, గతేడాది ఐసీసీ మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు స్మృతి వైస్-కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆ టోర్నమెంట్‌లో 434 పరుగులు చేసి జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది.
Go Back to Shorts
Smriti Mandhana
Dinesh Karthik
RCB
Royal Challengers Bangalore
WPL 2026
MS Dhoni
Womens Cricket
Cricket
Womens Premier League
Delhi Capitals

More Telugu News