ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

  • మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు
  • బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%.. బాలుర ఉత్తీర్ణత 82.68% 
  • గత ఏడాదితో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగిన ఉత్తీర్ణత
  • ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు
ఏపీలో పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం 4 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

బాలికల హవా.. మెరుగైన ప్రభుత్వ పాఠశాలలు
ఎప్పటిలాగే ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో బాలికలు తమ సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90% కాగా, బాలుర ఉత్తీర్ణత 82.68% వద్ద నిలిచింది. దీంతో బాలురపై బాలికలు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి 78.39 % ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది(72.8%)తో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ఉత్తీర్ణత శాతం పెరగడం రాష్ట్ర విద్యావ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

మంత్రి లోకేశ్ ట్వీట్‌
ఫ‌లితాల విడుద‌ల అనంత‌రం మంత్రి లోకేశ్ విద్యార్థు‌లు, ఉపాధ్యాయులు, పేరెంట్స్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ ప్ర‌త్యేకంగా ట్వీట్ చేశారు. "ఈ ఫ‌లితాలు మన విద్యార్థుల పట్టుదలను, ఉపాధ్యాయులు, కుటుంబాల బలమైన మద్దతును ప్రతిబింబిస్తాయి. విజయం సాధించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈసారి ఉత్తీర్ణత సాధించని వారు దయచేసి నిరాశ చెందవద్దు. ఫ్యామిలీ, ఉపాధ్యాయులు, సమాజం మద్దతుతో మీరు మరింత బలంగా తిరిగి వ‌స్తారు. మన విద్యార్థులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వెన్నెముక, ప్రతి బిడ్డ విజయం సాధించేలా చూడటానికి మేము కట్టుబడి ఉన్నాము" అని లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఫలితాలు తెలుసుకోవడం ఎలా?
విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అధికారిక వెబ్‌సైట్ results.bse.ap.gov.in లో హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. అలాగే, ఈసారి ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందే సౌకర్యం కల్పించినట్లు మంత్రి లోకేశ్‌ వివరించారు. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘LEAP’ మొబైల్ యాప్, కేంద్ర ప్రభుత్వ ‘డిజిలాకర్’ యాప్‌లలో కూడా విద్యార్థులు తమ మార్కుల వివరాలను చూసుకోవచ్చు.

కాగా, ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు సుమారు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 18,842 మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. ఫలితాల విడుదలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడినట్లయింది.

AP 10th Results
AP SSC Results
Andhra Pradesh
Nara Lokesh
SSC Results 2026
10th Class Results
AP Education
Girls Pass Percentage
Manamitra WhatsApp
BSEAP

More Telugu News