నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

  • అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం
  • సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం
  • పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోనుంది.

సమావేశం అజెండాలో అత్యంత కీలకమైనది అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.1,208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు కేబినెట్  ఆమోదముద్ర వేయనుంది. దీంతో పాటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్ల ఫేకేడ్, గ్లాజింగ్ పనులకు (రూ.2,540 కోట్లు), అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు (రూ.798 కోట్లు) కూడా ఆమోదం తెలపనున్నారు.

అలాగే, సెబీ, స్వామి నారాయణ్ గురుకుల్, డీఏవీ స్కూల్ వంటి పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు మెట్ట భూమికి రూ.40,000, జరీబు భూమికి రూ.60,000 చొప్పున వార్షిక కౌలు పెంచే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం.

Chandrababu
AP Cabinet Meeting
amaravati

More Telugu News