బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి

  • బెంగళూరులో భారీ వర్షానికి కూలిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ
  • ప్రమాదంలో ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు
  • ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
  • నగరంలో నీట మునిగిన రోడ్లు, 50కి పైగా చెట్లు నేలకూలాయి
బెంగళూరు నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉరుములు, మెరుపుల, వడగళ్లతో కూడిన వానకు శివాజీనగర్‌లోని ప్రభుత్వ బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు ఆయన కార్యాలయం ధృవీకరించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని రక్షించి, అదే ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బాధితులంతా ఆసుపత్రి సమీపంలో ఉండే వీధి వ్యాపారులని ప్రాథమిక సమాచారం. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు తమ తల్లిదండ్రులతో పాటు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ.. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఇది చాలా పాత గోడ అని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను వెంటనే బెంగళూరుకు తిరిగి వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శిస్తానని తెలిపారు.

బుధవారం సాయంత్రం గంటకు పైగా కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. బనశంకరి మెట్రో స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరి టికెట్ కౌంటర్ ఏరియా జలమయమైంది. నగర వ్యాప్తంగా సుమారు 50 చెట్లు నేలకూలడంతో పలుచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.



Bengaluru Rain
Deaths
Hospital
Siddaramaiah
Congress
Karnataka

More Telugu News