లీటర్ పెట్రోలుపై రూ.12.50 పెంచారా? ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

  • ఇంధన ధరలు రూ.12.50 మేర పెరిగాయన్న వార్త ఫేక్ అన్న కేంద్రం
  • ఈ ప్రచారాన్ని ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) 
  • ప్రస్తుతం ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టత
  • ప్రజలు ఆందోళన చెందవద్దు, సరిపడా ఇంధన నిల్వలున్నాయని వెల్లడి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.12.50 వరకు పెరిగాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశం పూర్తిగా నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం బుధవారం ఒక ప్రకటనలో కొట్టిపారేసింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రభుత్వ నోటిఫికేషన్ నకిలీదని, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఇంధన ధరల పెంపుపై ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ప్రజలు ఇటువంటి ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల ద్వారా మాత్రమే వార్తలను నిర్ధారించుకోవాలని సూచించింది.

మరోవైపు, పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన ధరలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ప్రస్తుతం రిటైల్ ఇంధన ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం గమనిస్తోందని, ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

"ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దు" అని శర్మ ప్రజలను కోరారు. దేశీయ ఎల్‌పీజీ, పీఎన్‌జీ, రవాణాకు ఉపయోగించే సీఎన్‌జీలకు 100 శాతం సరఫరాను ప్రభుత్వం నిర్ధారించిందని ఆమె వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పటికీ, దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Fact Check
Petrol
Diesel
Price Hike
Social Media Post
India

More Telugu News