కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా

  • మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సంపత్ కుమార్
  • తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన
  • తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వారిపై దావా వేశానని ఆయన తెలిపారు. వారు తనపై, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. మూడు నెలల క్రితం జరిగిన చిన్న సంఘటనను ఆధారంగా చేసుకుని తనపై వారు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.

వారు తమ సొంత మీడియా, సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం చేసి, తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని వాపోయారు. వారు నీచ రాజకీయాలు చేస్తున్నారని, కానీ అలాంటిది సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా తనపై తప్పుడు ప్రచారాలు చేయడాన్ని తాము సహించేది లేదని అన్నారు. అందుకే కోర్టుకు వచ్చామని తెలిపారు. ప్రజాప్రతినిధులుగా వారికి చట్టబద్ధంగా విమర్శించే, ప్రశ్నించే హక్కు ఉందని, కానీ ఇష్టారీతిన రాయవద్దని సూచించారు.

ఒక కాంట్రాక్టర్ వద్ద తాను రూ.8 కోట్లు అడిగినట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేసిందని సంపత్ కుమార్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. లేదంటే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

sampath kumar filed defamation case
Defamation case on KTR
Defamation case on Harish Rao

More Telugu News